ఒకటైమ్ లో టాలీవుడ్‌లో మాస్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్‌కు గత కొంతకాలంగా కలిసిరాలేదు. రీసెంట్ గా సీనియ‌ర్ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘విశ్వం’ కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. పరాజయాల పరంపరతో తడిసిపోయిన గోపీచంద్ ఇప్పుడు బ్రేక్ తీసుకుని ఫ్రెష్ ఎనర్జీతో తిరిగి వస్తున్నాడు. ఒక్క మాంచి హిట్ కోసం మళ్లీ ఫుల్ జోష్‌తో రెడీ అవుతున్నాడు.

తాజాగా గోపీచంద్‌ హీరోగా నటించబోతున్న మరో చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా కుమార్‌ సాయి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. గతంలో ఇదే బ్యానర్‌లో గోపీచంద్‌ ‘సాహసం’ వంటి సక్సెస్‌ఫుల్‌ సినిమాలో నటించారు.

థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కించనున్న ఈ సినిమా ద్వారా మలయాళీ నటి మీనాక్షి దినేష్‌ తెలుగులో నాయికగా అరంగేట్రం చేస్తున్నదని, భారీ వ్యయంతో నిర్మించబోతున్నామని, త్వరలో షూటింగ్‌ ప్రారంభిస్తామని మేకర్స్‌ తెలిపారు.

ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శామ్‌దత్‌ ఐఎస్‌సీ, సమర్పణ: బాపినీడు, దర్శకత్వం: కుమార్‌ సాయి.

అలాగే గోపీచంద్‌ హీరోగా సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో ఇటీవలే ఓ సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. 2025లో గోపీచంద్ ఈ రెండు సినిమాలను పూర్తి చేసి, మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వాలనే పట్టుదలతో ఉన్నాడు.

You may also like
Latest Posts from