గత కొన్నేళ్లుగా బ్లాక్ బస్టర్ సక్సెస్ కోసం తనవంతు కృషి చేస్తున్నాడు గోపీచంద్. కానీ, బాక్సాఫీస్ దగ్గర అదృష్టం కలిసి రావడం లేదు. డిఫరెంట్ జోనర్స్ ట్రై చేసినా ఆశించిన విజయం మాత్రం అందడం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘విశ్వం’ సినిమా కూడా డిజప్పాయింట్ చేసింది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయిన మ్యాచో స్టార్.. మరో కొత్త సినిమాను ప్రారంభించాడు.
డైరెక్టర్ సంకల్ప్ రెడ్డితో గోపీచంద్ ఒక ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ చేయడానికి రెడీ అయ్యారు. ‘Gopichand 33’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. దీన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.
తాజాగా సినీ సర్కిల్స్‌లో ఓ ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా నేపథ్యం 7వ శతాబ్దానికి చెందినదిగా ఉండబోతుందని.. ఇదొక హిస్టారికల్ ఎపిక్ మూవీగా రాబోతుందని తెలుస్తోంది.
అయితే, దర్శకుడు సంకల్ప్ రెడ్డి తన గత చిత్రాలను పంచభూతాల నేపథ్యంలో తెరకెక్కించాడు. ఘాజీ, అంతరిక్షం, ఐబి 71 చిత్రాలలో మూడు భూతాలను టచ్ చేసిన సంకల్ప్, ఇప్పుడు గోపీచంద్ చిత్రంలో నిప్పు నేపథ్యంలో తెరకెక్కించనున్నారట. ఇలా పంచభూతాలను వదలని దర్శకుడిగా సంకల్ప్ రెడ్డి మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాడు.
7వ శతాబ్దంలో ఇండియన్ హిస్టరీలో జరిగిన కొన్ని కీలకమైన సంఘటనల ఆధారంగా గోపీచంద్ 33వ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
భారీ స్థాయిలో రూపొందనున్న ఈ హిస్టారికల్ ఎపిక్ మూవీలో గోపీ ఇంతకముందెన్నడూ చూడని పాత్రలో కనిపించనున్నట్లు చిత్ర బృందం చెబుతోంది.
మణికంధన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్న ఈ చిత్రానికి చిన్నా ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు.