
బెంగళూరులో రేవ్ పార్టీ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న నటి హేమ తాజాగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకుని మీడియాతో మాట్లాడుతుండగా కన్నీళ్లు ఆపుకోలేకపోయారు.
“చేయని తప్పుకు మీడియా నన్ను బలిపశువుని చేసింది. కానీ దుర్గమ్మ సాక్షిగా చెబుతున్నా… నేను నిర్దోషిని. ఆ సమయంలో అమ్మవారే నాకు కొండంత ధైర్యం ఇచ్చారు. ‘నేనున్నాను… నువ్వు ముందుకు వెళ్లు’ అంటూ నన్ను బ్రతికించింది” అని హేమ ఉద్వేగానికి లోనయ్యారు.
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా అమ్మవారి దర్శనానికి వచ్చానని, కానీ ఈ ఏడాది తన పర్యటనకు ప్రత్యేకత ఉందని పేర్కొన్నారు. “గత ఏడాది నాపై పడిన నీలాపనిందలన్నీ దుర్గమ్మే తుడిచేసింది. ఎన్ని జన్మలు ఎత్తినా అమ్మవారి ఆశీస్సులు మరచిపోలేను” అని కన్నీటి పర్యంతమయ్యారు.
మీడియాకు హేమ ఒక విజ్ఞప్తి చేస్తూ… “దయచేసి వార్త ప్రచురించే ముందు నిజం తెలుసుకోండి. ఈరోజు గుడిలో నిలబడి చెబుతున్నాను – నేను ఆ తప్పు చేయలేదు” అని మరోసారి స్పష్టం చేశారు.
అలానే సినిమాల్లో నటించకపోవడానికి గల కారణాల్ని కూడా చెబుతూ.. ఈవెంట్స్, బిజినెస్ చాలా ఉన్నాయి. అందుకే గ్యాప్ తీసుకున్నాను. ప్రతి గుడిలో పూజారులు నా కోసం పూజలు చేశారు. హేమమ్మ క్షేమంగా రావాలని కోరుకున్నారు అని చెప్పుకొచ్చారు
ఇక కొద్ది కాలం క్రితం బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ కేసులో నటి హేమ పట్టుబడ్డారని, డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలిందని పోలీసులు ప్రకటించడం టాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. ఆ కేసులో విచారణ అనంతరం ఆమెను అరెస్ట్ చేయగా, తర్వాత న్యాయస్థానం స్టే ఇవ్వడంతో ఆమెకు తాత్కాలిక ఊరట లభించింది.
