
హైదరాబాద్ పోలీసులు ఆన్‌లైన్ పైరసీ మాఫియాపై కత్తి ఎత్తారు. ఇప్పటివరకు ఈ రాకెట్‌లో పలువురిని అదుపులోకి తీసుకోగా, అసలు మాస్టర్ మైండ్‌గా భావిస్తున్న పైరసీ వెబ్‌సైట్ హెడ్ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఇంతకీ ఆ పైరసీ సైట్ ఏదన్నది ఇప్పుడు అంతటా చర్చగా మారింది. కొందరు IBomma అని అంటున్నారు.
సమాచారం ప్రకారం.. ఈ గ్యాంగ్ కేవలం సినిమాలే కాకుండా OTT ప్లాట్‌ఫారమ్‌లను వాడుకొని ఆన్‌లైన్ బెట్టింగ్ నెట్‌వర్క్‌లను కూడా నడిపిందట! అందుకే పోలీసులు ఇప్పుడు ఓటిటీలను గమనిస్తూ, ఇతర రాష్ట్రాలతో జాయింట్‌గా ఆపరేషన్ చేస్తున్నారు.
ఒక సీనియర్ అధికారి స్పష్టం చేస్తూ – “ పైరసీ హెడ్ తప్పించుకోలేడు. త్వరలోనే పట్టుకుంటాం. ఇది దేశంలోనే అతిపెద్ద పైరసీ గ్యాంగ్, దాన్ని మట్టుబెట్టిన ఘనత హైదరాబాద్ పోలీసులదే” అని తెలిపారు. ఈ క్రాక్‌డౌన్ కేవలం పైరసీ మీదే కాదు… ఆన్‌లైన్ బెట్టింగ్, ఆర్థిక మోసాలపై కూడా ఘాటైన సంకేతం ఇస్తోంది.
కేసు పట్టుకున్న విధానం
ఈ ఏడాది మే 9న హీరో శ్రీవిష్ణు నటించిన ‘సింగిల్’ చిత్రం విడుదలైన రోజే పైరసీ బారినపడి ఆన్‌లైన్‌లో హెచ్‌డీ ప్రింట్ డౌన్లోడ్ లింకులు ప్రత్యక్షమయ్యాయి. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ ఫిల్మ్‌ఛాంబర్‌లోని యాంటీ పైరసీసెల్‌కు ఫిర్యాదు చేసింది.
సెల్ ప్రతినిధి మణీంద్ర నగరంలోని ఓ ప్రముఖ థియేటర్‌లో ఆ సినిమా పైరసీ జరిగినట్లు గుర్తించి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇన్‌స్పెక్టర్ నరేష్, ఎస్సై మన్మోహన్‌గౌడ్ బృందం దర్యాప్తు ప్రారంభించి సాంకేతిక ఆధారాలతో వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీలో ఉంటున్న జాన కిరణ్‌కుమార్‌ను జూన్‌లో అదుపులోకి తీసుకుని విచారించారు.
అతను ఏడాదిన్నర వ్యవధిలోనే 40కిపైగా చిత్రాలను పైరసీ చేసి రూ.40 లక్షలు సంపాదించినట్లు విచారణలో తేలింది. కిరణ్ ఖాతాకు క్రిప్టో కరెన్సీ పంపిన తమిళనాడుకు చెందిన సుధాకరన్, బిహార్‌కు చెందిన అర్సలాన్ అహ్మద్‌లను పట్టుకొని ఆరా తీయగా ఇద్దరు కీలక నిందితుల గురించి తెలిసింది. వారే సిరిల్ ఇన్ఫాంట్ రాజ అమలదాస్, అశ్వనీకుమార్.
తమిళనాడులో అసలు సూత్రధారి
దేశంలో పైరసీ సినిమాల మాస్టర్‌మైండ్‌గా పేరున్న అమలదాస్ స్వస్థలం తమిళనాడులోని వేలుస్వామిపురం. బీఈ పూర్తి చేసిన అతను సాంకేతికతపై పట్టుతో సినిమాలను పైరసీ చేసి విక్రయించడం ప్రారంభించాడు. అన్ని రాష్ట్రాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని శిక్షణ ఇచ్చాడు. వారి నుంచి వచ్చిన కంటెంట్‌ను తన సైట్‌లో అప్‌లోడ్ చేసేవాడు. సర్వర్ ఐపీ అడ్రస్‌లు నెదర్లాండ్, ప్యారిస్‌ల్లో ఉన్నట్టు చూపేవాడు.
కొత్త సినిమాలు పైరసీ చేసేందుకు ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌ల సంస్థలు సహకరిస్తున్నట్లు అతడు వెల్లడించాడు. వారు తమ సినిమా పైరసీ వెబ్‌సైట్లలో బెట్టింగ్, గేమింగ్‌యాప్‌ల ప్రకటనలిచ్చి అమాయకులను ఉచ్చులోకి దింపి సొమ్ము చేసుకుంటారన్నారు. దీనికి ప్రతిఫలంగా తనకు ప్రతి నెల 10 వేల డాలర్లు ఇస్తున్నట్లు అమలదాస్ చెప్పాడు. అతను వివిధ భాషలకు చెందిన 550 సినిమాలను పైరసీ చేయించి రూ.2 కోట్ల వరకు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు.
కన్ను దెబ్బతిన్నా హ్యాకింగే కిక్కు
పైరసీ సినిమాలతో కిరణ్‌కుమార్ ఖాతాలో చేరిన క్రిప్టోకరెన్సీని డాలర్‌గా మార్చే ట్రేడర్ అస్మిత్‌సింగ్ ఐపీ అడ్రస్‌ను పోలీసులు గుర్తించారు. ఆ క్రిప్టో వ్యాలెట్లను ఎక్స్‌ట్రాక్ట్ చేసిన పోలీసులకు బిహార్‌కు చెందిన అశ్వనీకుమార్ బండారం వెలుగుచూసింది. ఇంటర్ మధ్యలోనే ఆపేసిన అతడు యూట్యూబ్‌లో జావా, పైథాన్, లైనెక్స్ ఇతర సాఫ్ట్‌వేర్ కోర్సులు చేసి.. సర్వర్లను హ్యాక్ చేయడం నేర్చుకున్నాడు.
దేశవ్యాప్తంగా సినిమాలను థియేటర్లలో ప్రదర్శించే క్యూబ్, యూఎఫ్‌వో సంస్థల ప్రధాన సర్వర్లలోకి జొరబడి 2023లో మొదటిసారి ఒక సినిమా చూశాడు. తర్వాత ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్‌యాప్‌ల నిర్వాహకులకు 800 డాలర్లకు ఒక సినిమా చొప్పున విక్రయించడం ప్రారంభించాడు.
ఓటీటీ సర్వర్లనూ హ్యాక్ చేసి హెచ్‌డీ ప్రింట్‌లను కాజేసేవాడు. కంప్యూటర్ ఎక్కువ సమయం చూడటంతో ఇతడి కుడికన్ను పూర్తిగా దెబ్బతింది. నగర సైబర్‌క్రైమ్ పోలీసులు అతడి నివాసంలో తనిఖీలకు వెళ్తుండగానే సీసీ కెమెరాల్లో చూసి వెంటనే తన ఫోన్‌డేటా తొలగించాడు. అతడి వద్ద ఉన్న హార్డ్‌డిస్క్‌ను పరిశీలించిన పోలీసులు నివ్వెరపోయారు. బిహార్ ప్రభుత్వంలోని దాదాపు సగం సమాచారం అతని వద్ద ఉంది.
మూడు ప్రధాన బ్యాంకుల సర్వర్లను హ్యాక్ చేసి మొత్తం ఖాతాల జాబితా భద్రపరచుకున్నాడు. ఇదంతా కేవలం తన ఆనందం, కిక్కు కోసం చేశానని, విచారణలో వెల్లడించాడు. అతని ఖాతాలోని లక్ష డాలర్లను ఫ్రీజ్ చేసినట్టు సీపీ ఆనంద్ తెలిపారు. పైరసీ రాకెట్‌ను ఛేదించిన పోలీసులను ఆయన అభినందించారు.
ఇప్పుడు పెద్ద ప్రశ్న: పైరసీ బాస్ ఎక్కడ దాక్కున్నాడు?
పోలీసులు ఎప్పుడు పట్టుకుంటారు?
