తమిళ సినిమాకు ఇప్పటివరకు 1000 కోట్లు వసూలు చేసిన చిత్ర చరిత్ర లేదు. అయితే, ఇప్పుడు అందరి చూపూ సూపర్‌స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘కూలీ’ మీదే ఉంది. ఈ సినిమా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ, డైరెక్టర్ లోకేష్ మాత్రం వసూళ్ల మీద ఒత్తిడిని ఎప్పటికీ అంగీకరించబోనని చెబుతున్నారు.
రీసెంట్ ఇంటర్వ్యూలో లోకేష్ మాట్లాడుతూ –
“1000 crore, 2000 crore… ఇవి అన్ని నాలుగు అంకెల మ్యాజిక్ లాంటివే. కానీ ఈ లెక్కలు నా పని చేసే విధానాన్ని ప్రభావితం చేయవు. నేను సినిమా చేస్తే, అది మనసులోంచి రావాలి. వంద మార్కులు కొట్టాలన్న ఉద్దేశంతో సినిమా తీయను,” అని చెప్పారు.
అయితే వసూళ్ల విషయంలో తమ ప్రామాణికతను చెప్తూ, ఓ మంచి ఉదాహరణ ఇచ్చారు లోకేష్ —
“ఒక బ్యాట్స్‌మన్ 99 పరుగులకి అవుట్ అయితే, కాస్త నిరాశపడి బ్యాట్ నేలకొడతాడు. కానీ అదే 100 వందయ్యాక బ్యాట్ పైకెత్తి సెలబ్రేట్ చేస్తాడు. కాని ఆ 99 పరుగులు టీమ్ విజయంలో కీలకమైతే? అప్పుడు ఆ 99కే సెల్యూట్ చేయొచ్చు కదా! అదేలా చూస్తాను నేను. సినిమా మంచి టాక్ వస్తే , జనాలు ఎంజాయ్ చేస్తే, అదే విజయం.”
“కూలీ 1000 కోట్లు వసూలు చేస్తే నాకు సంతోషమే. కానీ అలాంటి అంచనాలే ఎందుకు? సినిమా మంచిదా కాదా అన్నదే అసలైన ప్రశ్న. వసూళ్లు కాదు. కథలోని హృదయం, మా టీమ్ కష్టమే ముఖ్యం,” అంటూ చెప్పుకొచ్చారు.
ఇలాంటి మాటలు ఒక కమర్షియల్ హంగామా నడుస్తున్న ఇండస్ట్రీలో వినిపించటం అరుదే. డైరెక్టర్‌గా కాదు, ఒక నిజాయితీ గల కథకుడిగా, లోకేష్ కనగరాజ్ ఈ తరహా వ్యాఖ్యలతో ప్రేక్షకుల్లో మంచి ఆశలు రేపుతున్నారు. ఆయన చెప్పినట్టు, నిజాయితీగా తీసిన సినిమా ఎంత దూరం తీసుకెళ్తుందో చూద్దాం!