సినిమా వార్తలు

వరుస ఫ్లాపుల మధ్య మాస్ మహారాజా షాకింగ్ నిర్ణయం

వరుసగా ఫ్లాపులు… బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ కోసం ఎదురుచూపులు… ఇలాంటి దశలో రవితేజ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడు? అసలు సినిమా సైన్ చేసే ముందు ఆయన డిమాండ్ ఏంటి? అన్న ప్రశ్నలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. కానీ అదే రవితేజ… అందరినీ షాక్‌కు గురిచేసే నిర్ణయం తీసుకున్నారు!

*రూపాయి కూడా తీసుకోకుండా సినిమా చేశాడా?

అవును… ఇది రూమర్ కాదు, నిర్మాతే స్వయంగా అంగీకరించిన నిజం. రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాకి ఒక్క రూపాయి కూడా పారితోషకం తీసుకోకుండా పనిచేశారు.
ఈ విషయాన్ని నిర్మాత సుధాకర్ చెరుకూరి అధికారికంగా వెల్లడించారు. ఇప్పటి వరకు రవితేజకు రూపాయి కూడా ఇవ్వలేదని స్పష్టంగా చెప్పారు.

రెమ్యునరేషన్ కాదు… లాభాల్లో వాటా!

సాధారణంగా “డబ్బు దొరికితే చాలు, కథ గురించి పట్టించుకోరు” అనే టాక్ రవితేజపై చాలాకాలంగా ఉంది. కానీ ఈ సినిమా ఆ టాక్‌ను పూర్తిగా తప్పు అని రుజువు చేస్తోంది.
ఈ సినిమాను రవితేజ లాభాల్లో వాటా తీసుకునే ఒప్పందంతో చేశారు. కథ నచ్చితే, క్యారెక్టర్ నమ్మకం కలిగిస్తే డబ్బు వెనక్కి పెట్టడానికి కూడా సిద్ధమే అని చూపించారు.

సంక్రాంతి అయితేనే చేస్తా – ముందే క్లారిటీ!

ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ సినిమా సంక్రాంతి సీజన్ కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. కుటుంబ ప్రేక్షకులకు నచ్చే ఎమోషన్, వినోదం, రిలేషన్‌షిప్ డ్రామా అన్నీ ఇందులో ఉన్నాయని చెప్పుకుంటున్నారు. అందుకే సినిమా సైన్ చేసే సమయంలోనే సంక్రాంతికి విడుదల అయితేనే చేస్తానని రవితేజ కండిషన్ పెట్టినట్టు సమాచారం. భారీ పోటీ ఉన్నప్పటికీ, అదే ఒప్పందం ప్రకారం ఈ సినిమా సంక్రాంతి బరిలోకి రావడం విశేషంగా మారింది. జనవరి 13న సినిమా బరిలోకి రావడం అదే కారణం.

వరుసగా మాస్ క్యారెక్టర్లు చేసి అవి వర్క్ అవుట్ కాకపోవడం రవితేజను కొంత వెనక్కి నెట్టి ఉందన్న టాక్ ఉంది. అదే సమయంలో తనకు సంబంధం లేని, కొత్తగా కనిపించే క్యారెక్టర్ కావాలని డైరెక్టర్ కిషోర్ తిరుమలను రవితేజ కోరారట. దానికి తగ్గట్టుగానే కిషోర్ తిరుమల తన సెన్సిబిలిటీతో ఒక కొత్త కథను, కొత్త పాత్రను రూపొందించారని చెబుతున్నారు. ఆ క్యారెక్టర్ నచ్చడంతోనే రవితేజ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. టీజర్, పాటల్లో కనిపిస్తున్న ఫ్రెష్ లుక్ కూడా ఆ నమ్మకాన్ని బలపరుస్తోంది.

మొత్తానికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ రవితేజకు సాధారణ సినిమా కాదు అనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. వరుస ఫ్లాపుల తర్వాత రెమ్యునరేషన్ వదిలేసి, కథ మీద నమ్మకంతో చేసిన ఈ ప్రయత్నం ఆయన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందా అనే ఆసక్తి ఇప్పుడు ప్రేక్షకుల్లో ఉంది. సంక్రాంతి ప్రేక్షకుల ముందుకు జనవరి 13న రానున్న ఈ సినిమా, రవితేజకు కొత్త ఆరంభం ఇస్తుందా లేదా అన్నది అప్పుడే తేలనుంది.

Similar Posts