బాలీవుడ్ నటి, ఎంపీ జయాబచ్చన్ (Jaya Bachchan) కొన్ని సార్లు ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడుతూంటారు. ఆయన వ్యాక్యలు వైరల్ అవుతూంటాయి. తాజాగా ఆమె అక్షయ్‌కుమార్ (Akshay Kumar) నటించిన ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్‌కథ’ (Toilet Ek Prem Katha) చిత్రంపై పై తీవ్ర విమర్శలు చేశారు.
ఆ సినిమా తాను చూడలేదని అన్నారు. ఆ సినిమా టైటిల్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. అదేం పేరంటూ కామెంట్స్ చేశారు. అదొక ఫ్లాప్ సినిమా అంటూ జాతీయ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.
జయ బచ్చన్ మాట్లాడుతూ…‘‘సినిమాలు చూసే విషయంలోనూ నేను కొన్ని పరిమితులు ఫాలో అవుతుంటా. ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్‌కథ’ పేరు నాకు ఏమాత్రం నచ్చలేదు. ఒక్కసారి ఆ టైటిల్ చూడండి. అలాంటి పేరు ఉన్న సినిమాలు చూడాలని నేను ఎప్పుడూ అనుకోను. అసలు అదేం పేరు? నిజంగా అది కూడా ఒక పేరేనా?’’ అని ప్రశ్నించారు.
అనంతరం ఆమె కార్యక్రమంలో పాల్గొన్న ప్రేక్షకులను ఉద్దేశించి.. ‘ఇలాంటి టైటిల్స్ ఉన్న చిత్రాలు చూడాలని మీరు కోరుకుంటారా?’ అని అడిగారు. కొంతమంది చేతులు ఎత్తగా..
‘‘ఈ కార్యక్రమంలో ఇంతమంది ఉండగా.. కేవలం నలుగురు మాత్రమే ఇలాంటి సినిమాలు చూడాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇది నిజంగా బాధాకరం. కాబట్టి ఇది ఫ్లాప్ సినిమా. ఇప్పుడున్న రోజుల్లో రాజకీయ పార్టీలు సైతం సినిమాలు రూపొందిస్తున్నాయి. దాని గురించి మాట్లాడాలంటే ఇప్పుడు చాలా సమయం పడుతుంది. ఇది కూడా అలాంటి ప్రచార చిత్రమే’’ అని ఆమె అభిప్రాయం వ్యక్తంచేశారు.
అక్షయ్‌కుమార్, భూమి ఫడ్నేకర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమే ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్‌కథ’ (Toilet Ek Prem Katha). శ్రీ నారాయణ్ సింగ్ దీనికి దర్శకత్వం వహించారు. 2017లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లు వసూలు చేసి విజయాన్ని అందుకుంది.