మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde)ను ఉద్దేశించి స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కామ్రా (Kunal Kamra) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై భాజపా ఎంపీ, బాలివుడ్‌ నటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut) స్పందించారు.

కేవలం 2 నిమిషాల ఫేమ్‌ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే సమాజం ఎక్కడికి వెళ్తుందో మనం ఆలోచించాలన్నారు. ఓ వార్తా సంస్థతో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

కంగనా మాట్లాడుతూ..‘కేవలం 2 నిమిషాల ఫేమ్‌ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే సమాజం ఎక్కడికి వెళ్తుందో మనం ఆలోచించాలి. మాట్లాడింది ఎవరైనా కావచ్చు. కానీ, ఒకరిని అవమానించడం, వారి పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేయడం సరికాదు.

విమర్శించాలనుకుంటే సాహిత్య ప్రక్రియ ద్వారా ఆ పని చేయవచ్చు. కానీ, కామెడీ అనే పేరుతో మన సంస్కృతిని, ప్రజలను దూషిస్తున్నారు. ఈ వివాదానికి సంబంధించి ఆ వేదికను కూల్చడం చట్టబద్ధంగానే జరిగింది. కానీ, నా విషయంలో మాత్రం చట్టవిరుద్ధంగానే జరిగింది’ అని కంగనా పేర్కొన్నారు.

ఇంతకీ విషయం ఏమిటంటే..

ఇటీవల హబిటాట్‌ స్టూడియోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏక్‌నాథ్‌ శిందేపై కునాల్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను ద్రోహితో పోల్చడంతో పాటు.. ‘దిల్‌ తో పాగల్‌ హై’ అనే హిందీ పాటలోని చరణాలను రాజకీయాలకు అనుగుణంగా మార్చి అవమానకర రీతిలో పాడారు.

దీంతో శివసేన శిందే వర్గం కార్యకర్తలు ఆ స్టూడియోపై దాడి చేసి ధ్వంసం చేశారు. దీంతో 12 మందిని అరెస్టు చేశారు. మరోవైపు పోలీసులు సోమవారం కునాల్‌పై కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈక్రమంలోనే బీఎంసీ ఉద్యోగులు భారీ పరికరాలతో అక్కడికి చేరుకొని స్టూడియోలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.

, ,
You may also like
Latest Posts from