ప్రముఖ నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు కర్ణాటక హైకోర్టు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాయి. “కన్నడ భాష తమిళం నుంచే పుట్టింది” అని కమల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కోర్టు తీవ్ర హెచ్చరికలు చేసింది. భావప్రకటనా స్వేచ్ఛను ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా ఉపయోగించకూడదని స్పష్టంగా సూచిస్తూ, ఆయన వెంటనే ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, అవసరమైతే క్షమాపణ చెప్పాలని ఆదేశించింది.

కోర్టు ఏమందంటే…

“మీరు సాధారణ వ్యక్తి కాదు. వాక్ స్వాతంత్ర్యం మీకు ఉంది, కానీ అది ఇతరుల హృదయాలను గాయపరచే విధంగా ఉండకూడదు. ప్రజల మనోభావాలను దెబ్బతీసేంతగా ప్రాథమిక హక్కులను వినియోగించుకోలేరు. ఇప్పుడు మేం ఈ అంశాన్ని మీకు వదిలేస్తున్నాం. మీరు ఎవరి హృదయాన్ని బాధపెట్టారో వారికి క్షమాపణ చెప్పండి” అని కోర్టు స్పష్టం చేసింది.

‘‘అలాగే ఒక ప్రజాప్రతినిధిగా అలాంటి ప్రకటన చేయకూడదు. మీ కామెంట్స్‌ వల్ల అశాంతి ఏర్పడింది. కన్నడ ప్రజలు మిమ్మల్ని క్షమాపణలు మాత్రమే అడిగారు. మీరు ఏ ప్రాతిపదికన ఆ ప్రకటన చేశారు? మీరు ఏమైనా చరిత్రకారుడా? లేక భాషావేత్తనా? ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారు?’’ అని కమల్‌హాసన్‌ను హైకోర్టు ప్రశ్నించింది.

#Kamal Hassan, #Karnataka High Court, #Thug Life

By admin