గత కొంతకాలంగా మోహన్‌బాబు కుమారులు మంచు మనోజ్, మంచు విష్ణుల మధ్య కొంతకాలంగా వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తన కారును దొంగిలించారని మనోజ్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాప పుట్టినరోజు వేడుకల కోసం మనోజ్ జయపుర వెళ్లడాన్ని అవకాశంగా తీసుకుని ఆయన సోదరుడు విష్ణు ఇదంతా చేయిస్తున్నారని అందులో ఆరోపించారు.
మంచు మనోజ్ మాట్లాడుతూ… ‘‘ఈ నెల 1న మా పాప పుట్టినరోజు సందర్భంగా జయపుర వెళ్లగా నా సోదరుడు విష్ణు 150 మందితో జల్‌పల్లిలోని ఇంట్లోకి ప్రవేశించి వస్తువులు, సామగ్రి ధ్వంసం చేశారు. మా కార్లను టోయింగ్ వాహనంతో ఎత్తుకెళ్లి రోడ్డు మీద వదిలేశారు.
నా కారును దొంగిలించి విష్ణు ఇంట్లో పార్కింగ్ చేశారు. జల్‌పల్లిలో నా భద్రతాసిబ్బందిపై దాడిచేశారు. కారు చోరీపై నార్సింగి పోలీసులకు సమాచారం ఇవ్వగా అది విష్ణు ఇంట్లో ఉన్నట్లు గుర్తించారు. రికవరీకి వెళ్లినప్పుడు దాన్ని మాదాపూర్‌కు పంపించారు’’ అని మనోజ్ ఓ ఛానల్‌తో మాట్లాడుతూ పేర్కొన్నారు.
పోలీసులు ఏమంటారంటే…
మంచు మనోజ్‌కు చెందిన కారును ఈ నెల 1వ తేదీ అర్ధరాత్రి దొంగిలించినట్టు అతని డ్రైవర్ సాంబశివరావు ఫిర్యాదు చేశాడని నార్సింగి ఇన్‌స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తెలిపారు.
2వ తేదీన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని, గుర్తు తెలియని వ్యక్తులు కారును దొంగిలించినట్టు గుర్తించి దాన్ని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. కారును దొంగిలించిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.