
సీక్రెట్ మ్యారేజ్ వార్తలపై మెహ్రీన్ ఫైర్
సోషల్ మీడియా, కొన్ని వెబ్‌సైట్లలో చక్కర్లు కొడుతున్న సీక్రెట్ మ్యారేజ్ వార్తలపై నటి మెహ్రీన్ ఫిర్జాదా తీవ్రంగా స్పందించింది. తనకు తెలియని వ్యక్తితో ఆమె రహస్యంగా పెళ్లి చేసుకుందన్న ప్రచారాన్ని ఆమె పూర్తిగా ఖండిస్తూ, ఇలాంటి నిరాధార కథనాలు తనను తీవ్రంగా బాధించాయని స్పష్టం చేసింది. రెండు సంవత్సరాలుగా ఇలాంటి రూమర్స్ నడుస్తున్నా మౌనంగా ఉన్నానని, కానీ ఈసారి మాత్రం నిజాన్ని చెప్పక తప్పలేదని మెహ్రీన్ తెలిపింది.
కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మెహ్రీన్, తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుని యువతలో క్రష్‌గా మారింది. ఆ తర్వాత అవకాశాలు వచ్చినప్పటికీ, ఎఫ్ 2, ఎఫ్ 3 మినహా ఆమె నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. లుక్ పరంగా మార్పులు వచ్చినా, కెరీర్ మాత్రం అనుకున్న దిశలో సాగలేదు. ఈ మధ్య బీజేపీ నాయకుడు భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం చేసి అందరికీ షాక్ ఇచ్చిన మెహ్రీన్, ఆ తర్వాత అదే ఎంగేజ్‌మెంట్‌ను రద్దు చేసుకొని మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం సింగిల్‌గా జీవితాన్ని కొనసాగిస్తున్న ఆమెపై తాజాగా సీక్రెట్ పెళ్లి అంటూ ప్రచారం జరగడం సోషల్ మీడియాలో కలకలం రేపింది.
ఈ నేపథ్యంలో మెహ్రీన్ తన సోషల్ మీడియా ద్వారా ఘాటుగా స్పందించింది. తన పెళ్లి గురించి తప్పుడు కథనాలు రాసిన జర్నలిస్టుల పేర్లను ప్రస్తావిస్తూ, ఇది జర్నలిజం కాదని, డబ్బుల కోసం రాసే పనికిమాలిన కథనాలని మండిపడింది. ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు సమాచారం ఎలా వ్యాపిస్తోందో చూసి ఆశ్చర్యపోతున్నానని, ఇలాంటి నిరంతర వేధింపుల వల్లే ఈ రోజు మాట్లాడాల్సి వచ్చిందని చెప్పింది. కొన్ని ఆంగ్ల వెబ్‌సైట్లలో తాను ఎప్పుడూ కలవని, తెలియని వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్టు రాయడం వికీపీడియా హ్యాక్ చేసి రెండు నిమిషాల పాపులారిటీ కోసం చేసిన నీచపు ప్రయత్నమని ఆరోపించింది.
చివరగా అసలు నిజాన్ని స్పష్టంగా చెబుతూ, తనకు ఇప్పటివరకు ఎవరితోనూ పెళ్లి కాలేదని మెహ్రీన్ తేల్చిచెప్పింది. భవిష్యత్తులో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటే, ఆ విషయాన్ని తానే స్వయంగా ప్రపంచానికి ప్రకటిస్తానని హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారగా, నిరాధార రూమర్స్‌పై ఆమె చేసిన ఈ స్ట్రాంగ్ క్లారిఫికేషన్‌కు పలువురు మద్దతు తెలుపుతున్నారు.
