
మలయాళ సినీ పరిశ్రమ గర్వకారణమైన అగ్రనటుడు మోహన్‌లాల్ మరో అపూర్వమైన గౌరవాన్ని అందుకున్నారు. భారతీయ సినిమా రంగంలోనే అత్యున్నత గుర్తింపుగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఆయనకు ప్రకటించబడింది. 2023 సంవత్సరానికి గానూ ఈ గౌరవం వరించగా, సెప్టెంబర్ 23న జరగబోయే 71వ జాతీయ చలనచిత్ర పురస్కార వేడుకలో మోహన్‌లాల్ ఈ అవార్డును స్వీకరించనున్నారు.
నాలుగు దశాబ్దాలకుపైగా తన అపార ప్రతిభతో భారతీయ సినీ ప్రస్థానాన్ని వెలుగులు నింపిన మోహన్‌లాల్ కేవలం మలయాళ పరిశ్రమకే కాదు, మొత్తం భారతీయ సినిమాకే ఓ విలువైన ఆస్తి. మలయాళ సినీ సాంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ, తన సహజమైన నటనతో, విభిన్నమైన పాత్రల ఎంపికతో, ఆర్ట్‌ఫిల్మ్ నుంచి మాస్ సినిమాల వరకు సమానంగా రాణించి ఆయన ప్రత్యేకమైన ముద్ర వేశారు.
ఇప్పటికే పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులతో దేశం ఆయన ప్రతిభను సత్కరించగా, ఇప్పుడు ఫాల్కే అవార్డు ఆయన కెరీర్‌కు మరింత వైభవం చేకూర్చింది. మలయాళ చిత్రసీమలో ఇంతకు ముందు అదూర్ గోపాలకృష్ణన్ ఈ గుర్తింపు పొందగా, ఇప్పుడు మోహన్‌లాల్ ఆ జాబితాలో చేరడం విశేషం.
మోహన్‌లాల్ ఒక నటుడు మాత్రమే కాదు – ఆయన ఓ పాఠశాల, ఓ ప్రేరణ, ఓ లెజెండ్. ఆయన రూపంలో భారతీయ సినిమా చరిత్రలో ఓ అజరామరమైన అధ్యాయం రాసుకుపోతుంది.
