
ఒకప్పుడు టెలివిజన్ ను ఎవరు ఆన్ చేసినా — ఎక్కడో ఒక మూలలో ఎంటీవీ మ్యూజిక్ వినిపించేది. పాప్, రాక్, ర్యాప్, రియాలిటీ — ఏ జానర్ అయినా, యూత్ మూడ్ సెట్ చేయడం ఎంటీవీ స్పెషాలిటీ. 80ల చివర, 90ల ప్రారంభం నుంచి “I Want My MTV!” అన్న నినాదం ప్రపంచాన్ని ఊపేసింది. మైకేల్ జాక్సన్ నుంచి మడోన్నా వరకు, తర్వాత బియాన్స్, జస్టిన్ బీబర్ వరకు — స్టార్‌డమ్‌కు దారి చూపిన మొదటి గేటు అదే ఎంటీవీ.
సోషల్ మీడియా రాకముందు కాలంలో ఎంటర్టైన్‌మెంట్ అంటే చాలా మందికి అంటే ఎంటీవీ అనే సమాధానమే ఉండేది. కానీ ఆ మ్యూజిక్ విప్లవాన్ని మొదలుపెట్టిన ఆ ఛానెల్ ఇప్పుడు ప్రేక్షకులకు ఒక నిరాశాజనకమైన వార్త చెప్పింది.
డిసెంబర్ 31తో ఎంటీవీ మ్యూజిక్ ఛానెల్స్ మూత
1981లో అమెరికాలో ప్రారంభమైన ఎంటీవీ (Music Television), నలభై ఏళ్లకు పైగా ప్రపంచవ్యాప్తంగా సంగీతప్రియులను, ఫ్యాషన్ అభిమానులను అలరించింది. కానీ ఇప్పుడు, కంపెనీ తమ మ్యూజిక్ ఛానెల్స్‌ను అధికారికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
డిసెంబర్ 31 నుంచి ప్రపంచవ్యాప్తంగా MTV 80s, MTV Music, MTV Live, Club MTV, MTV 90s వంటి మ్యూజిక్ ఛానెల్స్ ప్రసారం ఆగిపోతాయని ప్రకటించింది. అంటే నూతన సంవత్సరం ప్రారంభానికి ముందే ఈ మ్యూజిక్ లెజెండ్ తన యుగానికి ముగింపు పలకనుంది.
“రియాలిటీ షోలు మాత్రం కొనసాగుతాయి” — పారామౌంట్ గ్లోబల్
ఎంటీవీ ప్రస్తుత మాతృసంస్థ అయిన పారామౌంట్ గ్లోబల్, “మ్యూజిక్ ఛానెల్స్ మూసినా, రియాలిటీ షోలు మాత్రం ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూనే ఉంటాయి” అని తెలిపింది. గతంలో ‘Road Rules’, ‘The Real World’, ‘Jersey Shore’, ‘MTV Unplugged’ వంటి షోలు యూత్ కల్చర్‌ను పూర్తిగా మార్చేశాయి.
స్కైడ్యాన్స్ విలీనానంతరం ఖర్చు తగ్గింపు చర్య
కొన్ని నెలల క్రితం ఎంటీవీ, స్కైడ్యాన్స్ మీడియాతో విలీనమైంది. ఆ తర్వాత ఖర్చు తగ్గించే వ్యూహంలో భాగంగా, తక్కువ వ్యూస్ ఉన్న మ్యూజిక్ ఛానెల్స్‌ను మూసివేస్తున్నారని సమాచారం. సోషల్ మీడియా, యూట్యూబ్, స్పాటిఫై వంటి ప్లాట్‌ఫామ్‌ల వల్ల సంగీత వినియోగ పద్ధతులు పూర్తిగా మారిపోవడం కూడా ఈ నిర్ణయానికి కారణమైందని విశ్లేషకులు చెబుతున్నారు.
యూరప్, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌లో మొదట మూసివేత
మ్యూజిక్ ఛానెల్స్ మూతపెట్టే ప్రక్రియ ఇప్పటికే యూకే, ఐర్లాండ్‌లలో మొదలైంది. త్వరలో యూరప్, బ్రెజిల్, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్, పోలాండ్, ఆస్ట్రియా దేశాలకు కూడా ఇది విస్తరించనుంది.
“మా చిన్ననాటి జ్ఞాపకాలు తిరిగి వచ్చాయి…” — నెట్‌జన్ల స్పందన
ఎంటీవీ మ్యూజిక్ ఛానెల్స్ మూసివేత వార్తపై ప్రపంచవ్యాప్తంగా నెట్‌జన్లు భావోద్వేగంగా స్పందిస్తున్నారు.
“మేము మొదట మడోన్నా వీడియో ఎంటీవీలో చూశాం…”
“సోషల్ మీడియా లేకపోయినా ఆ రోజుల్లో మ్యూజిక్ ఫీల్ ఎక్కువగా ఉండేది…”
అని పాత అభిమానులు తమ జ్ఞాపకాలను పంచుకుంటున్నారు.
ఒకప్పుడు మ్యూజిక్ అంటే ఎంటీవీ, ఇప్పుడు మ్యూజిక్ అంటే ఇంటర్నెట్.
కాలం మారింది… కానీ ఎంటీవీ యుగం మ్యూజిక్ హిస్టరీలో ఎప్పటికీ చెరగని చాప్టర్‌గానే మిగిలిపోతుంది.
