నటుడిని అయినంత మాత్రాన ఎమ్మెల్యే కావాలని లేదు. చాలామంది నటులు రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయారు అంటూ బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు హిందూపురంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.
బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘నా రెండో పుట్టినిల్లు హిందూపురం. ఇది నందమూరిపురం. ఇక్కడ పౌరసన్మాన సభ నిర్వహించడం ఆనందంగా ఉంది. దీనికి కారకులైన అందరికీ కృతజ్ఞతలు. సినిమా కార్యక్రమం కంటే అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇది మీరు జరుపుకొంటున్న పండగ. మీ అభిమానం.. నా పూర్వజన్మ సుకృతం. ఈ సందర్భంగా.. నాకు జన్మనిచ్చిన రామారావు గారిని స్మరించుకుంటున్నా’’
‘‘పద్మభూషణ్ మీకు చాలా ఆలస్యంగా ఇచ్చారని చాలామంది అన్నారు. కాదు సరైన సమయంలోనే ఇచ్చారని చెప్పా. నాన్నగారి శతజయంతి నిర్వహించుకోవడం, మూడోసారి నేను ఎమ్మెల్యేగా గెలవడం, సినిమాల పరంగా నాలుగు వరుస విజయాలు అందుకోవడం, హీరోగా 50 ఏళ్లు పూర్తికావడం.. ఈ తరుణంలో పద్మభూషణ్ రావడం సంతోషం.
మొదట నాన్నగారు ఆ తర్వాత అన్నయ్య హరికృష్ణ గారు హిందూపురంకి ఎమ్మెల్యేగా పనిచేశారు. వాళ్ల తర్వాత ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే అదృష్టం నాకు దక్కింది. నా నిజాయితీ, కల్మషం లేని మనస్తత్వం చూసే మీరు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిస్తే సరిపోదు.. ప్రజలకు అవసరమైన పనులు చేస్తూ వచ్చాను. అందుకే మూడోసారి గెలవగలిగాను.
నటుడిని అయినంత మాత్రాన ఎమ్మెల్యే కావాలని లేదు. చాలామంది నటులు రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయారు అంటూ బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.
50 ఏళ్లు హీరోగా కొనసాగిన వ్యక్తి ప్రపంచంలో మరొకరు లేరు. నాకు అంతగా శక్తినిచ్చిన తెలుగుజాతికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ‘ఏం చూసుకుని.. బాలకృష్ణకు అంత పొగరు’ అని అంటుంటారు. నన్ను చూసుకునే నాకు పొగరు. బసవతారకం ఇండో- అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఛైర్మన్, ‘శ్రీరామరాజ్యం’లో రాముడిగా నటించడం.. ఇలా ప్రతిదీ నా జీవితంలో కలిసొచ్చింది’’ అని పేర్కొన్నారు.