
కస్టమ్స్ అధికారుల సీజ్‌తో కేరళలో కలకలం రేపిన దుల్కర్ సల్మాన్ ల్యాండ్ రోవర్ కేసు కొత్త మలుపు తీసుకుంది. “నా కారు స్మగ్లింగ్‌దీ కాదు, ట్యాక్స్ ఎగవేత జరగలేదు.. నేను ఇండియన్ రెడ్ క్రాస్ నుంచి లీగల్‌గా కొనుగోలు చేశాను” అని స్టార్ హీరో హైకోర్టులో పిటీషన్ వేసారు.
గత వారం కోచిలోని ఆయన నివాసం నుంచి కస్టమ్స్ అధికారులు ల్యాండ్ రోవర్ SUVని స్వాధీనం చేసుకున్నారు. ఇది ‘ఆపరేషన్ నుమ్‌ఖోర్’ లో భాగం. కేరళవ్యాప్తంగా అనుమానాస్పద రికార్డులతో ఉన్న లగ్జరీ కార్లపై కస్టమ్స్, పోలీసు, ట్రాన్స్‌పోర్ట్ శాఖలు చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్, దుల్కర్ సల్మాన్ లాంటి సినీతారలు సహా పలువురి నివాసాల్లో సోదాలు జరిపి 36 కార్లు స్వాధీనం చేసుకున్నారు.
అయితే కస్టమ్స్ అధికారులు తన లగ్జరీ కారును సీజ్ చేయడాన్ని సవాలు చేస్తూ దుల్కర్ పిటిషన్ దాఖలు చేశారు. తన ల్యాండ్ రోవర్ కారు స్మగ్లింగ్ చేసిందని కాదని, ఓ సంస్థ నుంచి కారును కొనుగోలు చేశానని పిటిషన్‌లో పేర్కొన్నారు. రూల్స్ ప్రకారం, వాటికి లోబడే ఆ కారును తీసుకున్నానన్నారు. కస్టమ్స్ క్లియరెన్స్, ఇన్‌వాయిస్ తదితర డాక్యుమెంట్స్ తన వద్ద ఉన్నాయని తెలిపారు.
కస్టమ్స్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఇదే సందర్భంలో కస్టమ్స్ విభాగం తన స్పందన తెలియజేయాలని సూచించింది.
ఇంతకీ దుల్కర్ సల్మాన్ కారు నిజంగానే లీగల్‌నా? లేక మరొక షాకింగ్ రహస్యం బయటకు రాబోతుందా?
