జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడి (Pahalgam terror attack)ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న ముష్కరులకు అండగా ఉన్న దాయాది పాకిస్థాన్‌ను గట్టిగా హెచ్చరించింది. ఆ దేశంతో దౌత్య సంబంధాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపధ్యంలో చాలా మంది సెలబ్రెటీలు స్పందిస్తున్నారు.

సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులంతా సోషల్‌ మీడియా వేదికగా మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నారు. ఇక టాలీవుడ్‌ స్టార్‌ హీరోహీరోయిన్లు కూడా పర్యటకులపై జరిగిన భీకర ఉగ్రదాడిని ఖండిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే చిరంజీవి, మహేశ్‌ బాబు, అల్లు అర్జున్‌తో పాటు బడా హీరోలంతా ఈ దాడిని ఖండిస్తూ ట్వీట్స్‌ చేశారు. తాజాగా సాయి పల్లవి(Sai Pllavi) కూడా ఉగ్రదాడి పై స్పందిస్తూ ఎక్స్‌లో సుధీర్ఘ పోస్ట్‌ పెట్టింది.

‘పహల్గాం దాడిలో జరిగిన నష్టం, కలిగిన బాధ, ఏర్పడిన భయం నాకు వ్యక్తిగతంగా జరిగినట్లు అనిపిస్తోంది. చరిత్రలో జరిగిన భయంకరమైన నేరాల గురించి తెలుసుకుని.. ఇప్పటికీ అలాంటి అమానవీయ చర్యలకు సాక్షిగా ఉండడం వల్ల.. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఏమి మారలేదని అర్థమవుతుంది.

ఆ జంతువుల సమూహం మిగిలి ఉన్న ఆ కొద్దిపాటి ఆశను తుడిచిపెట్టేసింది. కుటుంబంతో జ్ఞాపకాలను సృష్టించాలనుకునే మనస్తత్వం నుంచి, మీ ఎమోషన్స్, మీ కుటుంబం మీ ముందే కోల్పోవడం చూడడం వరకు.. ఇది నన్ను మన మూలాన్ని ప్రశ్నించేలా చేస్తుంది.

నిస్సహాయంగా, శక్తిహీనులుగా, కోల్పోయిన అమాయక జీవితాలు, వేదనకు గురైన కుటుంబాల కోసం నా హృదయపూర్వక సంతాపాన్ని , ప్రార్థనలను అందిస్తున్నాను’ అని సాయి పల్లవి ట్వీట్‌ చేసింది.

ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. చాలా మంది నెటిజన్స్‌ సాయి పల్లవిని విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. దీనికి కారణం గతంలో ఇండియన్‌ ఆర్మీ గురించి సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలే.

విరాటపర్వం సినిమా ప్రమోషన్స్‌ సమయంలో సాయిపల్లవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కశ్మీర్ పండితుల మీద జరిగిన దాడి.. గోవుల పేరిటి చేసే వాటిని రెండింటిని ఒకే విధంగా పోల్చారు.

ఆ సమయంలో ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు ఉగ్రదాడిని ఖండిస్తూ పోస్ట్‌ పెడితే.. ఆ పాత వీడియోను షేర్‌ చేస్తూ సాయి పల్లవిపై మరోసారి విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం సాయి పల్లవికి మద్దతు ఇస్తూ పోస్టులు పెడుతున్నారు.

,
You may also like
Latest Posts from