సినిమా వార్తలు

“బ్రూస్ లీ ఫైట్ నుంచి పుట్టింది ‘శివ’ ఐడియా!” – వర్మ షాకింగ్ డిస్క్లోజర్

తెలుగు సినీ చరిత్రలో విప్లవాత్మక మార్పు తెచ్చిన సినిమా ‘శివ’ (1989). నాగార్జున – రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన ఈ కల్ట్ క్లాసిక్ ఇప్పుడు మళ్లీ థియేటర్లలోకి వస్తోంది — 4K రిజల్యూషన్, డాల్బీ ఆట్మాస్ సౌండ్ తో!

రీ-రిలీజ్ ముందుగా మీడియా కోసం ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా నాగార్జున, వర్మ ఇద్దరూ ‘శివ’ వెనుకున్న అనుభూతులు, స్ఫూర్తులు, ఆ కాలం జ్ఞాపకాలు పంచుకున్నారు.

రామ్ గోపాల్ వర్మ చెప్పిన ఆసక్తికర విషయం ఏమిటంటే —

“శివ కథకు ఐడియా నాకు బ్రూస్ లీ Return of the Dragon చూసి వచ్చింది. ఆ సినిమాలో బ్రూస్ లీ రోమ్‌లో ఒక రెస్టారెంట్‌కి ఇబ్బంది పెట్టే గ్యాంగ్‌ని ఎదుర్కొంటాడు. నేను ఆ రెస్టారెంట్‌ని కాలేజ్‌గా మార్చి, నా అనుభవాలను కలిపాను. నా జీవితంలోనే వేగంగా రాసిన స్టోరీ అదే,” అని వర్మ చెప్పాడు.

అదే సినిమా మళ్లీ చూసినప్పుడు ఎలా అనిపించిందని అడిగితే నాగార్జున స్పందిస్తూ —
“సినిమా మళ్లీ చూడటం కంటే, రాము రాసిన నోట్‌ నన్ను మించి తాకింది. శివ పాత్ర అసలైన విలువలు, మానసిక బలం గురించి రామూ రాసిన మాటలు అద్భుతంగా ఉన్నాయి. వాటిని చదివిన తర్వాత నాకు మళ్లీ అలాంటి లోతు ఉన్న పాత్రలు చేయాలనే తపన కలిగింది,” అన్నారు నాగ్.

ఇక తన 100వ చిత్రం ‘King100’ గురించి మాట్లాడుతూ, యువ దర్శకుడితో ఎందుకు చేస్తున్నారని అడిగితే —
“దాంట్లో పెద్ద ఆలోచనేమీ లేదు. నాకు నచ్చింది కాబట్టి చేసేశాను. నేను ఎక్కువగా ఆలోచించను, హార్ట్ చెబితే చేస్తాను!” అని చిరునవ్వుతో సమాధానమిచ్చారు.

Similar Posts