
తెలుగు సినీ జర్నలిజంలో మళ్లీ ఓ వివాదం చెలరేగింది. ప్రముఖ మీడియా జర్నలిస్టు ఒకరిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కారణం? సెలబ్రిటీలకు అప్రసంగమైన, సంచలనాత్మక ప్రశ్నలు అడగడం! ఇటీవలే హీరో సిద్ధు జొన్నలగడ్డ ఎదుర్కొన్న సంఘటన ఈ చర్చను మళ్లీ రగిలించింది.
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘తెలుసు కదా’ సినిమా అక్టోబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచారంలో భాగంగా ఇటీవల నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఓ మహిళా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నపై వివాదం చెలరేగింది. “రియల్ లైఫ్‌లో మీరు ఉమనైజరా?” అని సిద్ధుని ప్రశ్నించడం హాట్ టాపిక్ అయింది. మంగళవారం నిర్వహించిన విప్రెస్ మీట్ లో సిద్ధు ఈ అంశంపై స్పందించారు. చేతిలో మైక్ ఉంది కదా అని ఏదిపడితే అది మాట్లాడడం సరికాదని అన్నారు.
”ఎలా స్పందించాలో నాకు అర్థం కాలేదు. అలా మాట్లాడటం చాలా డిస్‌రెస్పెక్ట్‌ఫుల్. మైక్ ఉంది కదా అని అలాంటి ప్రశ్నలు అడగటం కరెక్ట్ కాదు. ఇక నేను దీని మీద ఏమని స్పందించాలి? నేను ఇలాంటి విషయంలో డిస్కషన్ చేయాలి అనుకోలేదు. ఆమె అన్న మాట నాకు వినిపించింది. కానీ, అప్పుడు పట్టించుకోలేదు. వాటికి ఏం సమాధానం ఇవ్వగలం. అటువంటి ప్రశ్నలు అడగకూడదని తమకు తామే తెలుసుకోవాలి”
”సినిమాలో అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్‌గా ఉన్నంత మాత్రాన, నిజజీవితంలో కూడా చంపుకుంటూ తిరుగుతారా? మీరే చెప్పండి. సినిమాలో డ్రగ్ అడిక్ట్ అయినంత మాత్రాన, నిజ జీవితంలో కూడా డ్రగ్స్ తీసుకుంటూ తిరుగుతారా?. అది సినిమా కదా. మీ చేతిలో మైక్ ఉంది కదా, మేము సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నాం కదా అని ఇష్టం వచ్చిన ప్రశ్నలు అడగడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తోంది. ఈ విషయాన్ని డిస్కస్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు”
”నిజానికి ఆమె ఈ ప్రశ్న అడగడానికి కొద్ది సేపటి ముందే, తమ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇవ్వమని అడిగారు. సరిగ్గా 5 నిమిషాల తర్వాత ఇలాంటి ప్రశ్న అడిగారు. అంటే ఐదు నిమిషాల్లోనే ఆమె ఎలా మారిపోయిందో చూడండి. ప్రొడ్యూసర్ డబ్బులు పెడుతున్నాడు కదా, హీరో అన్నిటికీ ఆన్సర్ ఇస్తాడు అనుకుని ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారనిపిస్తోంది” అని సిద్దు జొన్నలగడ్డ చెప్పుకొచ్చారు.
సిద్ధు మాట్లాడిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెట్‌జన్లు ఆయన కూల్ కానీ ఫర్మ్ స్టాండ్‌కి చప్పట్ల వర్షం కురిపిస్తున్నారు.
