సినిమా వార్తలు

నెగటివ్ రివ్యూలు : ‘రాజాసాబ్’ మొదటి రోజు కలెక్షన్లు మాత్రం షాకే

రెబల్ స్టార్ ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి నిరూపితమైంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ కామెడీ ‘రాజాసాబ్’ నెగటివ్ టాక్‌ను సైతం తుడిచిపెట్టేస్తూ మొదటి రోజే వంద కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. విమర్శకులు పెదవి విరిచినా, ప్రేక్షకులు మాత్రం ప్రభాస్ కామెడీ టైమింగ్‌కు ఫిదా అవుతున్నారు.

వరల్డ్ వైడ్ 100 కోట్ల గ్రాస్! విడుదలైన తొలిరోజే ‘రాజాసాబ్’ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఒక్క ఇండియాలోనే శుక్రవారం రూ. 45 కోట్ల నెట్ వసూళ్లు రాగా, గురువారం నాటి ప్రీమియర్ షోలతో కలిపి మొత్తం భారత్ నెట్ వసూళ్లు రూ. 55 కోట్లకు చేరుకున్నాయి.

తెలంగాణలో దెబ్బకొట్టిన అనుమతులు!

ఆంధ్రప్రదేశ్‌లో పెయిడ్ ప్రీమియర్స్ అదరగొట్టినప్పటికీ, తెలంగాణలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. తెలంగాణలో ప్రీమియర్ షోల అనుమతులు అర్థరాత్రి రావడంతో పబ్లిసిటీకి సమయం లేకపోయింది. దీనివల్ల అక్కడ కలెక్షన్లు ఆశించిన స్థాయిలో రాలేదు. అయితే ఓవర్సీస్‌లో మాత్రం ప్రభాస్ మేనియా కనిపిస్తోంది. కేవలం నార్త్ అమెరికా నుండే రూ. 14 కోట్ల గ్రాస్ వసూలైంది.

హిందీలోనూ అదరగొట్టిన రాజాసాబ్!

తెలుగు వెర్షన్ రూ. 47.4 కోట్లతో బాక్సాఫీస్ వద్ద ఆధిపత్యం ప్రదర్శించగా, హిందీ వెర్షన్ కూడా రూ. 6.15 కోట్ల నెట్ వసూళ్లతో ఆకట్టుకుంది. ప్రభాస్ కామిక్ టైమింగ్, థమన్ ఎనర్జిటిక్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ పాయింట్లుగా మారాయి.

టాక్ నెగటివ్.. కానీ వసూళ్లు పాజిటివ్!

విజువల్ ఎఫెక్ట్స్ (VFX), నెమ్మదిగా సాగే కథనం మరియు స్క్రీన్ ప్లే లోపాలు ఉన్నాయని విమర్శకులు 2 నుండి 2.25 రేటింగ్స్ మాత్రమే ఇచ్చారు. అయినప్పటికీ, థియేటర్ల వద్ద కలెక్షన్ల సునామీ మాత్రం ఆగడం లేదు. ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ మెరవగా, సంజయ్ దత్ కీలక పాత్రలో నటించారు.

Similar Posts