రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ‘రాజాసాబ్’ ఈ సంక్రాంతికి వచ్చి ఫ్యాన్స్ ని ఎంతగా నిరాశ పరిచిందో తెలిసిందే. నార్త్ లో కూడా డార్లింగ్ మ్యాజిక్ పెద్దగా వర్కౌట్ కాలేదు. అయితే సినిమా ఫ్లాప్ అవ్వడం ఒకెత్తయితే.. మేకింగ్ లో జరిగిన భారీ వృధా (Wastage) ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నిర్మాతలకు సినిమా పోయిన బాధ కంటే, ఈ ‘వేస్టేజీ’ లెక్కలు చూస్తేనే గుండె ఆగిపోయేలా ఉందట.
గంట సినిమాను పక్కన పారేశారు!
ఇన్ సైడ్ వర్గాల సమాచారం ప్రకారం.. దర్శకుడు మారుతి ఈ సినిమా కోసం దాదాపు 4 గంటల ఫుటేజీని షూట్ చేశారట. కానీ థియేటర్లో రిలీజ్ చేసింది మాత్రం 3 గంటలే. అంటే దాదాపు ఒక గంట నిడివి గల సీన్లను ఎడిటింగ్ రూమ్ లోనే కత్తెర వేసి పక్కన పడేశారన్నమాట. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ సినిమాకి ఒక గంట షూటింగ్ అంటే మాటలా? ఆ సీన్ల కోసం పెట్టిన ఖర్చు, సెట్లు, కాల్షీట్లు అన్నీ బూడిదలో పోసిన పన్నీరేనా?
వేస్టేజీ ఖర్చే రూ. 60 కోట్లు?
ఈ ఒక్క గంట ఫుటేజీని పక్కన పెట్టడం వల్ల పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి (People Media Factory) దాదాపు రూ. 50 నుంచి 60 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. కేవలం వృధా కోసమే ఇంత ఖర్చు పెట్టడం చూసి ఇండస్ట్రీ వర్గాలు ముక్కున వేలేసుకుంటున్నాయి.
ఆ ఒక్క నిర్ణయం కొంప ముంచిందా?
నిజానికి 4 గంటల ఫుటేజీ వచ్చినప్పుడే సినిమాను రెండు భాగాలుగా (Part 1 & Part 2) రిలీజ్ చేద్దామనే ఆలోచన వచ్చిందట. కానీ దర్శకుడు మారుతి (Maruthi) అందుకు ఒప్పుకోలేదట. ‘రాజాసాబ్ 2’ కోసం తన దగ్గర వేరే కథ సిద్ధంగా ఉందని, ఈ ఫుటేజీతో పార్ట్ 2 చేయడం ఇష్టం లేదని చెప్పారట. పోనీ ఆ సీన్లను ఓటీటీ (OTT) వెర్షన్ లో అయినా వాడారా అంటే అదీ లేదు.
ప్చ్ విశ్వ ప్రసాద్!
గత నష్టాలను ఈ సినిమాతో పూడ్చుకుందామని ఆశపడ్డ నిర్మాత విశ్వ ప్రసాద్ కి.. ఈ సినిమా కొత్త నష్టాలను మిగిల్చింది. ప్లానింగ్ లోపం వల్ల కోట్లకు కోట్లు వేస్ట్ అవ్వడం ఇప్పుడు నిర్మాతకు మింగుడు పడడం లేదు.
ఈ షాకింగ్ న్యూస్ పై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి!

