టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్లలో ఒకరైన బన్నీ వాస్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. అది మరేదో కాదు 2025 దీపావళి కానుకగా విడుదలైన ‘మిత్ర మండలి’ సినిమా రిజల్ట్ గురించి. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ప్రియదర్శి, రాగ్ మయూర్ వంటి టాలెంటెడ్ నటులు ఉన్నప్పటికీ, ఈ కామెడీ డ్రామా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. ఈ సినిమా పరాజయం వల్ల తనకు ఎంత నష్టం వచ్చిందనే విషయాన్ని బన్నీ వాస్ బహిరంగంగా వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఎడిటింగ్ రూమ్‌లో సినిమా చూసినప్పుడు తనకు చాలా నమ్మకంగా అనిపించిందని, సినిమా కచ్చితంగా వర్కవుట్ అవుతుందని భావించానని ఆయన చెప్పుకొచ్చారు. అయితే థియేటర్లో ఆడియన్స్‌తో కలిసి చూసినప్పుడు అసలు విషయం అర్థమైందని, తాను ఎక్కడైతే నవ్వులు పూస్తాయని ఆశించానో అక్కడ థియేటర్ అంతా నిశ్శబ్దంగా ఉండటం తనను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఈ ఒక్క సినిమా వల్ల సుమారు 6 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని ఆయన స్పష్టం చేశారు.

అంతేకాకుండా, సినిమా విడుదలకు ముందు ఒక వ్యక్తిగత సెంటిమెంట్ కారణంగా తాను గుడికి వెళ్లాల్సి వచ్చిందని, అందుకే ఫైనల్ కాపీని పూర్తిగా చూడలేకపోయానని బన్నీ వాస్ వెల్లడించారు. బహుశా అదే పొరపాటని ఆయన పరోక్షంగా అంగీకరించారు. కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప తదితరులు నిర్మించిన ఈ చిత్రంతో నిహారిక ఎన్ఎమ్ తెలుగు తెరకు పరిచయమైంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

#Amazon Prime, #Bunny Vas, #Bunny Vas Loses Crores, #Mithra Mandali, #Mithra Mandali Review

By admin