
‘ధురంధర్’ కి రూ. 90 కోట్ల నష్టం ఎందుకో తెలుసా?
బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల క్లబ్ లో చేరి సంచలనం సృష్టిస్తున్న ధురంధర్ సినిమాకు సంబంధించి ఒక షాకింగ్ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఏడాది చివర్లో మామూలు అంచనాలతో విడుదలై ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టించిన ఈ చిత్రం ఒకచోట మాత్రం భారీ దెబ్బ తింది.
భారత్ తో పాటు అమెరికా మరియు యూరప్ దేశాల్లో రికార్డు బ్రేకింగ్ కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమాకు గల్ఫ్ దేశాల్లో మాత్రం చుక్కెదురైంది. అక్కడ సినిమా విడుదల కాకపోవడంతో ఏకంగా 90 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు చిత్ర విదేశీ పంపిణీదారు ప్రణబ్ కపాడియా అధికారికంగా వెల్లడించారు.
సాధారణంగా బాలీవుడ్ యాక్షన్ సినిమాలకు గల్ఫ్ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. ధురంధర్ సినిమాలోని హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ అక్కడి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయని పంపిణీదారులు భారీ ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా కథాంశం పాకిస్థాన్ కు వ్యతిరేకంగా ఉండటంతో బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా మరియు యూఏఈ వంటి దేశాలు ఈ చిత్రంపై నిషేధం విధించాయి.
దీంతో ఆయా దేశాల్లో సినిమా రిలీజ్ కాలేదు. దీనివల్ల రావాల్సిన సుమారు 90 కోట్ల రూపాయల రాబడిని కోల్పోవాల్సి వచ్చిందని ప్రణబ్ కపాడియా పేర్కొన్నారు. ఇతర దేశాల్లో మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత తమపై ఉందని అందుకే ఈ విషయంలో తాము ఏమీ చేయలేకపోయామని ఆయన వివరించారు.
గల్ఫ్ దేశాల్లో ఇంత భారీ నష్టం వాటిల్లినప్పటికీ ధురంధర్ ప్రభంజనం మాత్రం ఆగడం లేదు. ఇండియాలో మరియు ఇతర దేశాల్లో ఈ సినిమా ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్ల రూపాయల మైలురాయిని దాటేసి బాలీవుడ్ హిస్టరీలోనే టాప్ సినిమాల సరసన చేరింది.
అక్కడ ఎదురుదెబ్బ తగిలినా ఇక్కడ మాత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తుండటంతో చిత్ర యూనిట్ ఆనందంలో ఉంది. ఒకవేళ గల్ఫ్ లో కూడా సినిమా రిలీజ్ అయి ఉంటే ఈ వసూళ్లు మరో స్థాయికి చేరుకునేవని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
