తెలుగు సినిమా చరిత్రలో ‘క్లాసిక్’ అనగానే గుర్తొచ్చే చిత్రాల్లో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన ‘అతడు’ ఒకటి. త్రివిక్రమ్ శ్రీనివాస్ మేకింగ్, మహేష్ బాబు స్టైలిష్ లుక్, మణిశర్మ సంగీతం వెరసి ఈ సినిమాను ఒక ఆల్ టైమ్ హిట్ గా నిలిపాయి. ఇప్పటికీ టీవీలో ‘అతడు’ వస్తుందంటే చానల్ మార్చకుండా చూసే తెలుగు ప్రేక్షకులు కోట్లల్లో ఉంటారు. అయితే, ఇంతటి ఘనవిజయం సాధించిన ఈ చిత్రంలో మహేష్ బాబు కంటే ముందు మరో యంగ్ హీరో నటించాల్సి ఉందన్న విషయం మీకు తెలుసా?

మొదటి ఛాయిస్ మహేష్ బాబు కాదు!

సీనియర్ నటుడు, నిర్మాత మురళీ మోహన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ‘అతడు’ కథ సిద్ధమైనప్పుడు త్రివిక్రమ్ మరియు మురళీ మోహన్ గారు మొదట అనుకున్న హీరో మరెవరో కాదు.. అప్పట్లో సంచలన విజయాలతో దూసుకుపోతున్న లవర్ బాయ్ ఉదయ్ కిరణ్.

మురళీ మోహన్ మాటల్లో.. “ఉదయ్ కిరణ్ మొదటి సినిమా చూశాక చాలా బాగున్నాడు, చక్కని బుద్ధిమంతుడు అనిపించి ఫోన్ చేసి అభినందించాను. ఆ తర్వాత అతను ఇంటికి వచ్చి నన్ను కలిశాడు. ‘అతడు’ సినిమా తీద్దామనుకున్నప్పుడు ఫస్ట్ హీరోగా ఉదయ్ కిరణ్ నే అనుకున్నాం. అతను కూడా చేస్తానని మాట ఇచ్చాడు.”

మిస్ అవ్వడానికి కారణం అదేనా?

అయితే, సినిమా ఫైనలైజ్ అయ్యే సమయానికి పరిస్థితులు మారిపోయాయి. అప్పట్లో చిరంజీవి గారి అమ్మాయితో ఉదయ్ కిరణ్ పెళ్లి నిశ్చయమవ్వడం, ఇతర సినిమాల కమిట్‌మెంట్స్ వల్ల డేట్ల విషయంలో కన్ఫ్యూషన్ ఏర్పడింది. మురళీ మోహన్ గారు డేట్లు అడిగే సమయానికి, ఉదయ్ కిరణ్ పొరపాటున వేరే సినిమాలకు డేట్లు ఇచ్చేశానని, వచ్చే ఏడాది వరకు కుదరదని చెప్పారట. అలా ఉదయ్ కిరణ్ చేతుల్లోంచి ‘అతడు’ జారిపోయింది.

ఒకవేళ ఉదయ్ కిరణ్ చేసి ఉంటే?

ఒకవేళ ఉదయ్ కిరణ్ ఈ సినిమా చేసి ఉంటే అతని కెరీర్ మరోలా ఉండేదని విశ్లేషకులు భావిస్తుంటారు. సాఫ్ట్ అండ్ లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న ఉదయ్ కిరణ్ కి, నందు లాంటి పవర్‌ఫుల్ ప్రొఫెషనల్ కిల్లర్ పాత్ర ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అయ్యేది. అయితే, మహేష్ బాబు తన అద్భుతమైన నటనతో ఆ పాత్రకు ప్రాణం పోశారు. ఏది ఏమైనా, ఉదయ్ కిరణ్ ఆ క్లాసిక్ హిట్‌ను మిస్ చేసుకోవడం మాత్రం అతని అభిమానులకు నేటికీ ఒక చిన్న వెలితే!

#Athadu, #Mahesh Babu, #murali mohan, #Trivikram, #uday kiran

By admin