డార్లింగ్ ప్రభాస్.. ఈ పేరు వింటేనే అదిరిపోయే యాక్షన్ సినిమాలు గుర్తొస్తాయి. కానీ ఇండస్ట్రీలో ఆయన గురించి మాట్లాడుకునే మరో మెయిన్ టాపిక్ “రాజుల భోజనం”. ప్రభాస్ ఇంటి నుండి భోజనం వచ్చిందంటే అక్కడ పండగే. షూటింగ్ స్పాట్‌లో ఎవరైనా సరే.. ప్రభాస్ ఆతిథ్యం రుచి చూడాల్సిందే. అయితే తాజాగా ప్రభాస్ ఒక రోజు భోజనం ఖర్చు గురించి నెట్టింట ఒక వార్త సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
లంచ్ మెనూలో 20కి పైగా వెరైటీలు!
ప్రభాస్ భోజన ప్రియుడు మాత్రమే కాదు, అంతకు మించి భోజనం పెట్టే గుణం ఉన్న వ్యక్తి. ఆయన మెనూలో ముఖ్యంగా నాన్ వెజ్ ఐటమ్స్ అంటే మామూలుగా ఉండవు. చేపల పులుసు, నాటు కోడి కూర, మటన్ కర్రీ, వేయించిన రొయ్యలు, బిర్యానీ.. ఇలా కనీసం పదుల సంఖ్యలో వెరైటీలు ఉంటాయి. ముఖ్యంగా గోదావరి జిల్లా స్పెషల్ “పులస చేపల పులుసు” అంటే ప్రభాస్‌కు ప్రాణం. ఆయన పెద్దమ్మ శ్యామలా దేవి కూడా ప్రభాస్ భోజనం ఇష్టాల గురించి పలుమార్లు గొప్పగా చెప్పారు.
రోజుకు 2 లక్షల రూపాయల ఖర్చు?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. ప్రభాస్ కోసం సిద్ధమయ్యే భోజనానికి రోజుకు దాదాపు 2 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందట. ప్రభాస్ ఎప్పుడూ ఒంటరిగా భోజనం చేయరు. షూటింగ్ సెట్‌లో తనతో పాటు కనీసం 10 నుండి 20 మందికి భోజనం తెప్పిస్తుంటారు. ఒక్కోసారి మొత్తం యూనిట్ సభ్యులందరికీ తన ఇంటి నుండే వంటలు చేయించి పంపిస్తారు. దీనికోసం ప్రభాస్ దగ్గర ఒక ప్రత్యేకమైన “కుకింగ్ టీమ్” కూడా ఉందని సమాచారం.
“భోజనం పెట్టి చంపేస్తారు!”
ప్రభాస్ ఆతిథ్యం గురించి రాజమౌళి నుండి దీపికా పదుకొణె వరకు అందరూ ఫిదానే. దర్శకుడు రాఘవ లారెన్స్ ఒక ఈవెంట్లో మాట్లాడుతూ.. “ఎవరైనా తిట్టి చంపేస్తారు లేదా కొట్టి చంపేస్తారు.. కానీ ప్రభాస్ మాత్రం భోజనం పెట్టి చంపేస్తారు” అని సరదాగా కామెంట్ చేశారు. అమితాబ్ బచ్చన్, కరీనా కపూర్ కూడా ప్రభాస్ పంపిన భోజన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఆయన పెద్ద మనసును కొనియాడారు.

