సినిమా వార్తలు

“ఒక చిన్న తప్పు… “బైకర్” బజ్‌ నేలకూల్చేసింది!”

శర్వానంద్ ఎప్పుడూ డిఫరెంట్ స్క్రిప్టులను ఎంచుకునే హీరోగా పేరుంది. ఇప్పుడు ఆయన నటిస్తున్న కొత్త సినిమా “బైకర్” కూడా అంతే ప్రత్యేకంగా ఉంది. బైక్‌ రేసింగ్‌ నేపథ్యంలోని ఈ స్పోర్ట్స్‌ డ్రామాను అభిలాష్ కంకర దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. సినిమా డిసెంబర్‌ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

ఇటీవల విడుదలైన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. చాలామంది దీనిని “తెలుగు F1 సినిమా” అంటున్నారు. కానీ… ఒక్క చిన్న పాట టీజర్‌ వల్ల ఆ హైప్‌ ఒక్కసారిగా కిందపడిపోయింది. అదే ఇప్పుడు “కాస్ట్‌లీ మిస్టేక్”గా మారింది.

వివరాల్లోకి వెళ్తే—మేకర్స్‌ తాజాగా విడుదల చేసిన “ప్రిటీ బేబీ” అనే ఫస్ట్‌ సాంగ్‌ ప్రోమోలో, శర్వానంద్‌, మాలవిక నాయర్‌ల మధ్య రొమాంటిక్‌ డ్యాన్స్‌ సీన్‌లు చూపించారు. సాధారణ సినిమా అయితే ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు. కానీ బైకర్ విషయంలో మాత్రం ప్రేక్షకుల అంచనాలు వేరు.

టీజర్‌ చూసిన వాళ్లు ఈ సినిమాను ఒక సీరియస్‌ స్పోర్ట్స్‌ డ్రామాగా భావించారు. అసలు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ లేకుండా, నిజమైన రేసింగ్‌ ఎమోషన్‌ మీదనే నడుస్తుందని అనుకున్నారు. ముఖ్యంగా శర్వానంద్‌ ఇండోనేషియాలో ప్రొఫెషనల్‌ రేసర్లతో నిజమైన లొకేషన్లలో షూట్‌ చేశామని చెప్పడంతో, ఆ అంచనాలు మరింత పెరిగాయి.

కానీ ఈ రొమాంటిక్‌ డ్యాన్స్‌ సాంగ్‌ ప్రోమో ఆ ఫీలింగ్‌ మొత్తాన్ని దెబ్బతీసింది. సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చూస్తే—

“F1 డ్రైవర్స్‌ ఇలా డ్యాన్స్‌ చేయరేమో!”
అనే సెటైర్లు విరివిగా కనిపిస్తున్నాయి.

ఇలా ఒక్క పాట ప్రోమోతో టీజర్‌ తెచ్చిన పాజిటివ్‌ వైబ్‌ మొత్తం కరిగిపోయింది. ప్రేక్షకులు మాత్రం మేకర్స్‌కు క్లియర్‌గా సూచిస్తున్నారు—

“ఇలాంటివి సినిమాకి సీరియస్‌ మూడ్‌ని బ్రేక్‌ చేస్తాయి, దయచేసి మళ్లీ ఆలోచించండి” అని.

మొత్తం మీద, ఈ “చిన్న తప్పు” ఇప్పుడు బైకర్‌ టీమ్‌కి “ఖరీదైన తప్పు”గా మారిపోయింది. ఇక అసలు పాట నవంబర్‌ 13న విడుదల కానుంది — ఆ పాటతో బజ్‌ మళ్లీ గేర్‌ మార్చుకుంటుందా? అనేది చూడాలి!

Similar Posts