సినిమా వార్తలు

ఎన్టీఆర్ ‘వార్ 2’ నష్టాలపై నాగ వంశీ క్లారిటీ… నిజం ఇదేనా?

2025 టాలీవుడ్ ట్రేడ్‌లో ఎక్కువ చర్చకు దారి తీసిన సినిమాల్లో ‘వార్ 2’ ఒకటి. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లాంటి భారీ స్టార్లు కలిసి నటించిన ఈ సినిమా తెలుగులో భారీ బిజినెస్ చేసినప్పటికీ, బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయింది. దీంతో నిర్మాత నాగ వంశీకి భారీ నష్టాలు వచ్చాయని కొంతకాలంగా ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ ప్రచారంపై నాగ వంశీ స్వయంగా స్పందిస్తూ అధికారిక క్లారిటీ ఇచ్చారు.

‘వార్ 2’ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను నాగ వంశీ కొనుగోలు చేశారన్న విషయం తెలిసిందే. అయితే రిలీజ్ తర్వాత సినిమా ఫెయిలవడంతో, ఈ డీల్‌పై అనేక రకాల కథనాలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా తెలుగు రైట్స్ కోసం 80 కోట్ల వరకు చెల్లించారని, అదే మొత్తంతో డిస్ట్రిబ్యూషన్ డీల్స్ కూడా జరిగాయని, జీఎస్టీ మినహాయించి కూడా భారీ నష్టాలు వచ్చాయని ట్రేడ్‌లో గట్టిగా వినిపించింది. ఈ నేపథ్యంలో తన తాజా ఇంటర్వ్యూలో నాగ వంశీ ఆ వార్తలన్నింటికీ స్పష్టత ఇచ్చారు.

నష్టాల గురించి వస్తున్న కథనాలకు స్పందిస్తూ, నాగ వంశీ అసలు నిజాన్ని బయటపెట్టారు. తాను ‘వార్ 2’ను తెలుగు రాష్ట్రాల్లో 68 కోట్లకు కొనుగోలు చేశానని ఆయన చెప్పారు. థియేటర్లలో సినిమా ద్వారా దాదాపు 40 కోట్ల షేర్ వచ్చింది అని వెల్లడించారు. ఆ తర్వాత యశ్ రాజ్ ఫిల్మ్స్ నుంచి తనకు ఫోన్ వచ్చిందని, ఒప్పందం ప్రకారం వారు 18 కోట్లను తిరిగి రీఫండ్ చేశారని తెలిపారు. ఈ లెక్కలన్నింటిని కలిపి చూసుకుంటే, ఈ సినిమాతో తనకు పెద్ద నష్టాలు ఏమీ లేవని నాగ వంశీ స్పష్టంగా చెప్పారు.

ఈ సందర్భంగా యశ్ రాజ్ ఫిల్మ్స్‌పై నాగ వంశీ ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. పెద్ద కార్పొరేట్ బ్యానర్ అయినప్పటికీ, ఒప్పందాన్ని గౌరవిస్తూ వెంటనే రీఫండ్ ఇవ్వడం నిజంగా అభినందనీయం అన్నారు. ఇలాంటి ప్రొఫెషనల్ వ్యవహారం చాలా అరుదుగా కనిపిస్తుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత ప్రయాణం గురించి కూడా నాగ వంశీ ఓపెన్‌గా మాట్లాడారు. ఈ సంవత్సరం తనకు అనుకున్నంతగా కలిసి రాలేదని, కొన్ని నిర్ణయాలు ఓవర్ కాన్ఫిడెన్స్‌తో తీసుకున్నానని ఆయన అంగీకరించారు. అన్నీ అనుకున్నట్టే జరుగుతాయనే భావనతో తీసుకున్న నిర్ణయాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని చెప్పారు. ఈ అనుభవం ద్వారా ఒక విషయం బలంగా అర్థమైందని, ఏ విషయాన్నీ లైట్‌గా తీసుకోకూడదని, ఏదీ గ్రాంటెడ్‌గా భావించకూడదని గ్రహించానని తెలిపారు.

ఈ తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుని, మళ్లీ కొత్తగా మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నట్టు నాగ వంశీ చెప్పారు. మొదట తాను ఎక్కడి నుంచి మొదలయ్యాడో, ఆ బేసిక్స్‌కి తిరిగి వెళ్లి, జాగ్రత్తగా అడుగులు వేయాలన్నదే తన ప్లాన్ అని స్పష్టం చేశారు. ‘వార్ 2’ చుట్టూ సాగిన నష్టాల కథనాలకు తెరదించుతూ, ఈ వివరణ టాలీవుడ్ ట్రేడ్‌లో ఇప్పుడు కొత్త చర్చకు దారి తీస్తోంది.

Similar Posts