
ఒకప్పుడు తెలుగు తెరపై వెలిగిన వెలుగైన నటి రాశి. ‘గోకులంలో సీత’, ‘స్నేహితులు’ సినిమాలతో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ఆమె, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, నాగార్జున వంటి అగ్రహీరోల సరసన నటించి 90లలో టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. కానీ ఇప్పుడు కెరీర్ రివర్స్ అయ్యింది. అందుకు కారణం ఏ సినిమానో చెప్పుకొచ్చింది.
‘ఆకతాయి’ సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన రాశి.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంది. ‘అమ్మో ఒకటో తారీఖు’, ‘చెప్పాలని ఉంది’, ‘శ్రీరామచంద్రులు’, ‘దీవించండి’, ‘దేవుళ్లు’, ‘నాగ ప్రతిష్ట’, ‘పెళ్లి పందిరి’, ‘శుభాకాంక్షలు’ సహా పలు హిట్ సినిమాలు చేసింది. సినిమాల్లో అవకాశాలు తగ్గుతున్న క్రమంలోనే, బుల్లితెరపైనా సత్తా చాటింది. ‘గిరిజా కల్యాణం’, ‘జానకి కలగనలేదు’ సహా పలు సీరియల్స్ లో కనిపించింది.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాశి, తన కెరియర్‌ను పూర్తిగా మార్చేసిన సినిమా గురించి సంచలన విషయాలు బయటపెట్టారు.
“మహేష్ బాబు నటించిన ‘నిజం’ సినిమా కోసం తేజ గారు పిలిపించారు. బరువు తగ్గమని ట్రైనర్ కూడా పెట్టారు. కానీ మొదటి రోజే చెప్పకుండా ఒక సీన్ షూట్ చేశారు. నేను చేయనని చెప్పినా, బాబురావు గారు నచ్చజెప్పడంతో అయిష్టంగానే చేశాను. తరువాత తేజ గారు సారీ అన్నా… నేను అంగీకరించలేదు. ఆ సీన్ వలన నా ఇమేజ్ దెబ్బతింది. నా ఫ్యాన్స్ నిరాశపడ్డారు. నా కెరియర్ కూడా కూలిపోయింది.” అని రాశి ఘాటుగా చెప్పింది.
మరింతగా – “ఏ డైరెక్టర్‌ను మరిచిపోవాలని అనుకుంటారు?” అని అడిగితే, “తేజ” అనే సమాధానం ఇచ్చానని రాశి షాకింగ్ రివలేషన్ చేశారు.
కొన్నిసార్లు నచ్చకపోయినా చేసిన సినిమాలు ఉన్నాయి. మేకప్ వేసుకున్న తర్వాత సెట్ నుంచి రాశి వచ్చేసింది అనే పేరు రాకూడదనే అలా చేశాను. నేను వృత్తికి ఎంతో గౌరవం ఇస్తాను.
తర్వాత ఆయన సినిమాల్లో నటించినా, ఆ సినిమా విషయంలో ఇది నిజం! అని చెప్పింది.
అలాగే “రాశీ సినిమాలను వద్దు అనుకుంది. కానీ, సినిమాలు రాశిని వద్దు అనుకోలేదు. ఇప్పటికీ నాకు చాలా అవకాశాలు వస్తున్నాయి. అయితే, అచితూచి నిర్ణయం తీసుకుంటున్నాను. నటనా ప్రాధాన్యత ఉన్న ఎలాంటి పాత్రను చేయడానికైనా రెడీ. తల్లిగా, అత్తగా, అక్కగా ఏ పాత్ర అయినా చేస్తాను. హీరోయిన్ గా అయితే ఇంకా మంచిది” అని చెప్పుకొచ్చింది.
