ప్రముఖ సినీ నటుడు విజయ్ రంగరాజు(vijay Rangaraju) కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. వారం రోజుల క్రితం ఓ సినిమా షూటింగ్‌లో గాయపడిన విజయ్ రంగరాజును చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయనకు నేడు గుండెపోటు రావడంతో కన్నుమూశారు.
క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఫైట్ మాస్టర్‌గా, ఫైటర్‌గా, విలన్‌గా అన్ని భాషల్లో కలుపుకుని దాదాపు ఐదు వేలకు పైగా సినిమాల్లో ఆయన పనిచేశారు. 1994లో వచ్చిన భైరవ ద్వీపం(Bhairava Dweepam) చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యారు. పుట్టింది పూణెలో అయినా పెరిగింది మాత్రం ముంబైలోనే! జాకీ ష్రాఫ్, రంగరాజు ఒకే స్కూల్‌లో చదువుకున్నారు. ఆ తర్వాత గుంటూరుకు షిఫ్ట్ అయి అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశాడు. గోపీచంద్ ‘యజ్ఞం’ సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు దక్కింది.
విజయ్ రంగరాజు అసలు పేరు ఉదయ రాజ్‌కుమార్. మోహన్‌లాల్ హీరోగా నటించిన ‘వియత్నాం కాలనీ’ అనే మలయాళ సినిమాతో సినీరంగంలోకి అరంగేట్రం చేశారు. ఆ చిత్రం విజయం సాధించడంతో వరుసగా అవకాశాలు అందుకున్నారు. ఆ సమయంలోనే తెలుగులో ‘భైరవద్వీపం’లో విలన్‌గా నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఇండస్ట్రీలో అప్పటికే ఉదయ రంగరాజు అనే నటుడు ఉండడంతో తన పేరును విజయ రంగరాజుగా మార్చుకున్నారు.