‘అవతార్’ 3 కి షాకింగ్ ఫస్ట్ రివ్యూలు, ఇంత తక్కువ రేటింగా?
2009లో వచ్చిన ‘అవతార్’ సినిమా ప్రపంచ సినీ చరిత్రను మార్చేసింది. అప్పటి వరకు ఎవ్వరూ ఊహించని స్థాయిలో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. దాదాపు 2.9 బిలియన్ డాలర్ల వసూళ్లతో ఎన్నేళ్లూ అజేయంగా నిలిచింది. ఆ స్థాయి విజయం తర్వాత జేమ్స్ కామెరూన్‌పై అంచనాలు సహజంగానే ఆకాశాన్ని తాకాయి. అదే అంచనాలతో వచ్చిన సీక్వెల్ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ మిక్స్‌డ్ రివ్యూలు పొందినా, బాక్సాఫీస్ వద్ద 2.3 బిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే కంటెంట్ విషయంలో వచ్చిన అసంతృప్తి ఇప్పుడు మూడో భాగంపై స్పష్టమైన ప్రభావం చూపిస్తోంది.
ఇప్పుడు ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ, తొలి సమీక్షలు అభిమానులకు షాక్ ఇచ్చేలా ఉన్నాయి. రాటెన్ టొమాటోస్‌లో ఈ సినిమాకు 70 శాతం మాత్రమే రేటింగ్ రావడం గమనార్హం. ఇది ఇప్పటివరకు వచ్చిన అవతార్ చిత్రాల్లో అతి తక్కువ రేటింగ్‌గా నిలవడం చర్చకు దారి తీస్తోంది. ఈ ప్రారంభ స్పందన చూసి, సినిమా క్రిటికల్‌గా బలంగా నిలుస్తుందా అనే సందేహాలు మొదలయ్యాయి.
డిసెంబర్ 19న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా మూడు గంటల పన్నెండు నిమిషాల నిడివితో రూపొందింది. అయితే ఇంత పెద్ద ప్రాజెక్ట్‌కు ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. ‘ది వే ఆఫ్ వాటర్’ సమయంలో కనిపించిన హడావుడి ఈసారి కనిపించకపోవడం గమనార్హం. ముఖ్యంగా రెండో భాగానికి వచ్చిన వీక్ వర్డ్ ఆఫ్ మౌత్ ఇప్పుడు ‘ఫైర్ అండ్ యాష్’పై నమ్మకాన్ని తగ్గించినట్లు ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇదే సమయంలో తెలుగు బాక్సాఫీస్ పరిస్థితి కూడా ఆసక్తికరంగా మారింది. గత రెండు నెలలుగా థియేటర్లు పెద్దగా సందడి లేకుండా నడుస్తున్నాయి. 2025 చివర్లోకి వచ్చేసరికి కొద్దిగా ఊపొచ్చింది. గత వారం ‘అఖండ 2’ మంచి హవా నడిపింది. ఈ వారం కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని నిర్మాతలు ఆశిస్తున్నారు. అయితే ఇదే సమయంలో ‘అవతార్ 3’ రూపంలో టాలీవుడ్ బాక్సాఫీస్‌కు ఒక రకమైన టెన్షన్ ఏర్పడింది.
అవతార్ ప్రభావం కారణంగా డిసెంబర్ 19న తెలుగు సినిమాలను విడుదల చేయడానికి నిర్మాతలు వెనకాడుతున్నారు. ముఖ్యంగా మల్టీప్లెక్స్‌ల్లో ఈ సినిమా భారీగా వసూళ్లు సాధించే అవకాశం ఉందనే అంచనాతో పోటీకి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇప్పటికే ప్రీ బుకింగ్స్ మొదలయ్యాయి, అడ్వాన్స్ బుకింగ్స్ జోరు కూడా బాగానే ఉందని థియేటర్ వర్గాలు చెబుతున్నాయి.
గత అనుభవం చూస్తే, అవతార్ బ్రాండ్ తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగిన స్థాయిలో వసూళ్లు సాధించింది. అవతార్ 2 కంటెంట్ పరంగా ఓకే అనిపించినా, థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ కోసం ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అదే ఫార్ములా ఈసారి కూడా వర్కౌట్ అవుతుందా అన్నదే కీలక ప్రశ్న. ఒకవేళ టాక్ కాస్త పాజిటివ్‌గా మారితే, కేవలం అవతార్ 3కే కాదు, క్రిస్మస్ సీజన్‌లో వచ్చే ఇతర సినిమాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇప్పుడు అంతా ఒక్క అంశంపైనే ఆధారపడి ఉంది. తొలి సమీక్షలతో ఏర్పడిన నెగటివ్ ఫీలింగ్‌ను ప్రేక్షకుల స్పందన ఎంతవరకు మార్చగలుగుతుందన్నది. ‘ఫైర్ అండ్ యాష్’ నిజంగా పాండోరా మాజిక్‌ను మళ్లీ చూపిస్తే, రెండు బిలియన్ డాలర్ల మార్క్‌ను టచ్ చేయడం పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ అలా కాకపోతే, ఇది అవతార్ ఫ్రాంచైజీలోనే అత్యంత బలహీనమైన భాగంగా మిగిలిపోవడం ఖాయం అనే చర్చ ఇప్పటికే మొదలైంది.
