పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో రూపుదిద్దుకున్న భారతీయ సినిమాల గతి మార్చిన చిత్రం “బాహుబలి”. తెలుగు సినిమాకు కొత్త శకం మొదలుపెట్టిన ఈ విజువల్ వండర్ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇదే స్పెషల్ సందర్భాన్ని పురస్కరించుకుని మేకర్స్ సినిమా రీరిలీజ్ పై అదిరిపోయే అప్డేట్ ప్రకటించారు.
ఇప్పటికే రెండు భాగాలుగా రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్స్ గా నిలిచిన ఈ సినిమాను, మళ్లీ ఒకే భాగంగా “బాహుబలి: ది ఎపిక్” టైటిల్‌తో ఈ ఏడాది అక్టోబర్ 31న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి థియేటర్లలోకి రానుంది.
రీరిలీజ్‌పై భారీ హైప్ నడుస్తున్న వేళ, దీనిలో రన్‌టైమ్ ఎంత ఉంటుందా అనే సందేహం ఫ్యాన్స్‌కి కలిగింది. రెండు భాగాల్ని కలిపి ఒకే భాగంగా విడుదల చేయబోతుండటంతో, రన్‌టైమ్‌పై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. దీనిపై ఎట్టకేలకు మేకర్స్ ఓ క్లూ ఇచ్చారు. “బాహుబలి: ది ఎపిక్” రన్‌టైమ్ సుమారు 3.5 గంటల వరకు ఉంటుందని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
ఇకపోతే ఈ స్పెషల్ ఎడిషన్‌లో ఏమైనా అదనపు కంటెంట్ ఉందా? కొత్తగా ఏమైనా జతచేస్తారా? అనే అంశాలపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. కానీ, 10 ఏళ్ల తర్వాత మళ్లీ బాహుబలి థియేటర్లో చూడబోతున్న అభిమానులకు ఇది ఓ అద్బుతమైన అనుభవమే కానుంది.
అక్టోబర్ 31న “బాహుబలి – ది ఎపిక్” మళ్లీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి చరిత్ర సృష్టించబోతుందో, మరిన్ని రికార్డులకు నాంది పలుకుతుందో చూడాలి!