సాధారణంగా సూపర్ హిట్ చిత్రాల టైటిల్స్ రిపీట్ చేయాలంటే భయపడుతూంటారు. ఎందుకంటే ఆ స్దాయి కథ, నటన లేకపోతే విమర్శలు వస్తాయి. ఖచ్చితంగా పోల్చి చూస్తారు. ఈ విషయం తెలిసినా కొన్ని సార్లు పాత క్లాసిక్ టైటిల్స్ ని కొత్త సినిమాలకు పెడుతూంటారు. ఆ క్రమంలోనే తాజాగా శర్వానంద్ చిత్రానికి బాలకృష్ణ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన టైటిల్ ‘నారీ నారీ నడుమ మురారి’ని పెట్టారు. దాంతో ఒక్కసారిగా అటెన్షన్ గ్రాబ్ అయ్యింది.
శర్వానంద్ 37వ చిత్రానికి ‘నారీ నారీ నడుమ మురారి’ ఫిక్స్ చేశారు. ఈ టైటిల్‌ని నటసింహం బాలయ్య ఆధ్వర్యంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేయడంతో.. టైటిల్ అనౌన్స్‌మెంట్‌తోనే ఈ సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్లిపోయింది.
బాలకృష్ణ, శోభన, నిరోషా కాంబినేషన్‌లో 1990లో ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. ఈ మూవీ అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది.
ఇప్పుడిదే టైటిల్‌తో ఇద్దరు భామల మధ్య నలిగిపోయే ప్రేమికుడిగా శర్వానంద్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శర్వానంద్ 37వ చిత్రానికి బాలయ్య క్లాసిక్ టైటిల్ అయిన ‘నారీ నారీ నడుమ మురారీ’ టైటిల్‌ని అనౌన్స్ చేస్తూ.. ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.
‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అజయ్ సుంకర సహ నిర్మాతగా, కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ రైడ్‌కు విశాల్ చంద్ర శేఖర్ సంగీతం, జ్ఞాన శేఖర్ విఎస్ సినిమాటోగ్రఫీ, భాను బోగవరపు కథ, నందు సావిరిగణ, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.