నాని సమర్పణలో ప్రియదర్శి హీరోగా నటించిన కోర్టు రూమ్ డ్రామా ‘కోర్ట్’. కేవలం ట్రైలర్ తోనే ఓ రేంజిలో క్రేజ్ తెచ్చుకుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఈ శుక్రవారం థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్లలో బిజీగా ఉన్న చిత్ర టీమ్ సినిమా గురించి అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను బయట పెట్టారు. అందులో భాగంగా హీరో ప్రియదర్శి ‘పుష్ప 2’ వివాదానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అంశం ఈ మూవీలో ఉండబోతుందని స్పష్టం చేశారు.
‘కోర్టు’ మూవీ ప్రమోషన్స్ టైంలో ప్రియదర్శి మాట్లాడుతూ ‘పుష్ప 2’ వివాదం ఈ మూవీలో ఉందని క్లారిటీ ఇచ్చారు.
అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2 : ది రూల్’ మూవీ వివాదం ఇండస్ట్రీలో పెను తుఫాను సృష్టించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద ఈ మూవీ రిలీజ్ టైంలో జరిగిన విషాదకరమైన తొక్కిసలాట సంఘటన అల్లు అర్జున్ ను ఒక రాత్రంతా జైల్లో ఉంచింది.
ఆ టైమ్ లో అందరి దృష్టిలో పడ్డారు న్యాయవాది నిరంజన్ రెడ్డి. ఈ కేసులో ఆయన వాదించిన తీరుపై సర్వత్రా చర్చ నడిచింది. ఇక ‘కోర్ట్’ మూవీలో ‘పుష్ప 2’ కేసు విచారణ సమయంలో న్యాయవాది నిరంజన్ రెడ్డి ఉపయోగించిన భాషను గమనించిన తర్వాత, ఈ మూవీలోని ‘కోర్ట్’ సీన్స్ అతేంటిసిటీని పెంచడానికి మేకర్స్ డబ్బింగ్ సర్దుబాటు చేశారని ప్రియదర్శి చెప్పుకొచ్చారు.