అభిమాని రేణుకాస్వామి (33) హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్టైన కన్నడ నటుడు దర్శన్‌ (Darshan) డిసెంబర్‌ నెలలో బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఇన్‌స్టా లో ఓ వీడియో పెట్టారు. అభిమానులను ఉద్దేశించి ఇందులో ఆయన మాట్లాడారు. అలాగే ఇప్పుడు ఈ వీడియో పెట్టడానికి కూడా ప్రత్యేక కారణముంది. అదేమిటో చూద్దాం.

దర్శన్ వీడియోలో ఏమి మాట్లాడారంటే..‘‘కష్ట సమయాల్లో మీ ప్రేమ నాలో ధైర్యాన్ని నింపింది. వ్యక్తిగతంగా మీ అందరినీ కలవాలని.. కృతజ్ఞత తెలపాలని ఉంది. కాకపోతే తీవ్ర వెన్నునొప్పి, అనారోగ్య సమస్యల వల్ల అది వీలుపడటం లేదు. ఆ కారణంతోనే ఈ ఏడాది నా పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నా. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా. త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి వస్తా. మీ అందరినీ కలుస్తా’’ అని దర్శన్‌ తెలిపారు.

సోషల్‌మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. కొన్ని గంటల్లోనే దీనిని సుమారు నాలుగు లక్షల మంది లైక్‌ కొట్టారు. గెట్‌ వెల్‌ సూన్‌ అని సందేశాలు పంపారు.

రేణుకాస్వామి హత్య కేసు కర్ణాటకలో సంచలనం. చిత్రహింసలకు గురి చేసి అతడిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో దర్శన్‌, నటి పవిత్రగౌడ సహా 15 మందిని అరెస్టు చేశారు.

నిందితులు రేణుకాస్వామిని అత్యంత పాశవికంగా కొట్టినట్లు తేలింది. అతడికి కరెంట్‌షాకులు కూడా పెట్టినట్లు పోస్టుమార్టం నివేదిక పేర్కొంది. ఈ కేసులో అరెస్టైన దర్శన్‌ కొన్ని నెలల పాటు జైలులో ఉన్నారు.

తీవ్ర వెన్నునొప్పితో బాధపడుతున్న ఆయనకు కర్ణాటక హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన వెన్ను నొప్పికి సంబంధించిన చికిత్స తీసుకుంటున్నారు.

కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సినిమా షూటింగ్స్‌లో కూడా పాల్గొనడం లేదని సమాచారం.

You may also like
Latest Posts from