సత్యదేవ్, ఆనంది ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్‌సిరీస్ ‘అరేబియా కడలి’ (Arabia Kadali). సూర్యకుమార్ దర్శకుడు. స్టార్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దీనికి రైటర్‌గా పని చేయడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించారు. ఆగస్టు 8వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో శుక్రవారం చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్‌ను పరిశీలిస్తే, ఇది ఇటీవల థియేటర్లలో విజయవంతమైన నాగచైతన్య సినిమా ‘తండేలు’ కథను స్పష్టంగా గుర్తు తెస్తోంది.
‘అరేబియా కడలి’లో చూపిన ప్రధాన నేపథ్యం — తెలుగు మత్స్యకారులు పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించి అక్కడి జైళ్లకు వెళ్లిపోవడం — ఇదంతా తండేలు సినిమాలో ప్రధానాంశమే. అంతేకాదు, సత్యదేవ్ – ఆనంది లవ్ ట్రాక్ కూడా చైతన్య – సాయి పల్లవిల భావోద్వేగ ప్రేమకథను గుర్తుకు తెస్తుంది.
ఈ వెబ్ సీరీస్‌కు కథను రచించినది ప్రముఖ దర్శకుడు క్రిష్, దర్శకత్వం సూర్య కుమార్ వహించారు. మొత్తం 8 ఎపిసోడ్లుగా తెరకెక్కిన ఈ సిరీస్ ఒక వైపు బలమైన ఎమోషన్స్, మరోవైపు రాజకీయ ముసుగులోని మానవ హక్కుల చర్చను కూడా తడిమేలా ఉంది.
కానీ అసలు ఆసక్తికరమైన ప్రశ్న ఇది:
ఈ కథ నిజంగా తండేల్ కు ముందు నుండి ప్లాన్ చేసినదా? లేక తండేల్ విజయం చూసి, అదే నేపథ్యాన్ని వెబ్ మాధ్యమానికి అనుకూలంగా మార్చారా?
తండేల్ సినిమా పేరులోని అర్థమే ఒక సాంప్రదాయ మత్స్యకార నాయకుడి గుర్తింపుగా నిలుస్తుంది. అదే నేపథ్యాన్ని అమెజాన్ ఒరిజినల్ సిరీస్‌గా మార్చడాన్ని కొందరు ప్రేక్షకులు “తెలుగు సినిమాను తిరగరాసినట్టు”గా చూస్తున్నారు.
సముద్రంలో చేపల వేటపై ఆధారపడి జీవించే కొందరు మత్స్యకారుల హృదయవిదారక కథను ఆవిష్కరించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అనుకోకుండా అంతర్జాతీయ సరిహద్దులు దాటి, విదేశీ గడ్డపై బందీలుగా మారిన వారి పోరాటం, బంధాలు, ఆశల గురించి ఈ సిరీస్‌లో చూపించనున్నారు.