
‘అఖండ 2’ లో తలతో దిష్టి తీసే సీన్ పై బోయపాటి వివరణ
భారీ అంచనాల మధ్య విడుదలైన ‘అఖండ 2: తాండవం’ బాక్సాఫీస్ దగ్గర మొదటి రెండు రోజులు హడావుడిగా కనిపించినా, క్రమంగా కలెక్షన్లు డ్రాప్ అవుతున్నాయనే చర్చ ట్రేడ్‌లో వినిపిస్తోంది. ఫ్యాన్స్ సెలబ్రేషన్స్, వైరల్ వీడియోలు ఒకవైపు ఉంటే, మరోవైపు కొన్ని సన్నివేశాలపై ట్రోలింగ్, లాజిక్ విమర్శలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా సినిమాలోని కొన్ని అతీతమైన యాక్షన్ సీన్లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ, దర్శకుడు బోయపాటి శ్రీను వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి తీసుకొచ్చాయి.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2: తాండవం’ను 14 రీల్స్ ప్లస్ పతాకంపై గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట నిర్మించారు. ఈ సినిమా మొదట ఈ నెల 5న విడుదల కావాల్సి ఉండగా, పలు కారణాల వల్ల డిసెంబర్ 12న థియేటర్లలోకి వచ్చింది. విడుదలైన వెంటనే సినిమాలోని కొన్ని సీన్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా తలతో దిష్టి తీసే సన్నివేశం, హెలికాప్టర్ నుంచి విడిపోయిన ఫ్యాన్ రెక్కలను త్రిశూలంతో తిప్పే సీన్‌పై తీవ్ర చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన బోయపాటి శ్రీను తన స్టాండ్‌ను స్పష్టంగా చెప్పారు.
ఇలాంటి సినిమాల్లో లాజిక్స్ వెతకడం సరికాదని ఆయన అన్నారు. దేశానికి పెద్ద విపత్తు రాబోతుందని, దాన్ని నివారించాలంటే అష్టసిద్ధి సాధన ఒక్కటే మార్గమని ముందే మురళీమోహన్ పాత్ర ద్వారా స్పష్టంగా చెప్పామని వివరించారు. అష్టసిద్ధి అంటే సాధారణ సాధన కాదని, దాన్ని చేసినవారు చిన్న రూపాన్ని పొందగలరని, అదే సమయంలో విశ్వరూపాన్ని కూడా ప్రదర్శించగలరని చెప్పారు. ఆ సాధనలోని మహత్తునే సినిమాలో చూపించామని ఆయన స్పష్టం చేశారు. సూపర్ హ్యూమన్‌గా అఖండ మారడాన్ని కూడా లాజికల్‌గా వివరించామని చెప్పారు.
మనిషితో దిష్టి తీసే సీన్ గురించి మాట్లాడుతూ, సాధారణంగా గుమ్మడికాయతో దిష్టి తీస్తారని, కానీ అసాధారణ శక్తులు సాధించిన వ్యక్తి తొలి పోరాటంలో ఎంత పవర్ ఉంటుందో చూపించేందుకే ఆ సన్నివేశాన్ని పెట్టామని అన్నారు. అన్ని కమర్షియల్ సినిమాల్లో ఉండే యాక్షన్ అంశాలు ఇందులోనూ ఉంటాయని, అయితే ఆ క్యారెక్టర్ సూపర్ పవర్‌గా కనిపించాలంటే కొంత అతీతం తప్పనిసరి అని బోయపాటి అన్నారు.
తాను ఈ సినిమా మొత్తం లాజిక్ ప్రకారమే రాసుకున్నానని, ఏ అంశాన్నైనా విమర్శించే వారు ఉంటారని, ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చకపోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. కానీ అష్టసిద్ధి సాధన సుమారు 14 నుంచి 16 సంవత్సరాల పాటు సాగుతుందని, ఆ సాధన చేసినవారికి మానవాతీత శక్తులు వస్తాయని స్పష్టంగా చెప్పామన్నారు. అఖండ అష్టసిద్ధి సాధన తర్వాత ఆయన చేయి తగిలితేనే శవాలు లేచేలా పరిస్థితి ఉంటుందని కూడా ముందే హింట్ ఇచ్చామని తెలిపారు. ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా కొందరు ట్రోల్స్ చేస్తున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో, సినిమాలో హెలికాప్టర్ ఫ్యాన్ సీన్‌ను రాజకీయ కోణంలో మలచుతూ, వైసీపీ ఎన్నికల గుర్తును సూచించేలా ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన బోయపాటి శ్రీను, తనకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదని ఖండించారు. తాను ఎవరికైనా విమర్శ చేయాలనుకుంటే నేరుగా డైలాగ్స్‌తో చేస్తానని, డొంకతిరుగుడు వ్యాఖ్యలు చేసే అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. హెలికాప్టర్ పేలినప్పుడు దాని భాగాలు అక్కడున్న ప్రజలకు హాని చేయకుండా అఖండ అడ్డుకునేలా సీన్ రాసుకున్నామని, అందులో ఫ్యాన్ రెక్కలు అనువుగా అనిపించడంతో వాడామని చెప్పారు.
అఖండ సినిమా కేవలం ఒక సినిమా కాదని, అది భారతదేశ ఆత్మని బోయపాటి వ్యాఖ్యానించారు. ప్రతి విషయం అందరికీ నచ్చాల్సిన అవసరం లేదని, నచ్చని వారు ట్రోల్ చేయవచ్చని ఆయన అన్నారు. అవెంజర్స్, సూపర్ మాన్, బ్యాట్ మాన్ లాంటి పాత్రలు సృష్టించబడినవని, కానీ మన పురాణాల్లోని పాత్రలు సత్యాలపై ఆధారపడ్డవని చెప్పారు. కురుక్షేత్రంలో అన్ని ఆయుధాలు వాడినప్పుడు రేడియేషన్ లాంటి ప్రభావాలు కనిపించినట్లు మన చరిత్రలోనే ఉందని గుర్తుచేశారు. మన దగ్గర అంత గొప్ప చరిత్ర ఉన్నప్పుడు ఇలాంటి సినిమాలు ఎన్నైనా చేయొచ్చని, అవసరమైంది సంకల్పం, ఓపిక మాత్రమేనని బోయపాటి శ్రీను అన్నారు.
ఒకవైపు అఖండ 2 కలెక్షన్లు డ్రాప్ అవుతున్నాయనే చర్చ నడుస్తుండగా, మరోవైపు దర్శకుడు తన సినిమా వెనుక ఉన్న ఆలోచనలను ఇలా డిఫెండ్ చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివరణలు ట్రోలింగ్‌ను ఆపుతాయా, లేక చర్చను మరింత పెంచుతాయా అన్నది చూడాల్సి ఉంది.
