వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్లీ చట్టపరమైన ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. మాజీ ఐపీఎస్ అధికారి అంజనా సిన్హా ఆయనపై కేసు వేశారు. తన వృత్తి గుర్తింపును అనుమతి లేకుండా వర్మ నిర్మించిన “దహనం” వెబ్‌ సిరీస్‌లో వాడారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

అంజనా సిన్హా 1990 బ్యాచ్‌ అధికారి. రాయలసీమలో ఎస్పీ, డీఐజీగా, అనంతరం తెలుగు రాష్ట్రాల్లో ఎడిజీపీగా పనిచేశారు. ప్రస్తుతం నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్నారు. తన పేరు, కెరీర్ ప్రొఫైల్‌ను ఎప్పుడూ వర్మ టీమ్‌కి ఇవ్వలేదని, వారిని కలిసిన సందర్భమే లేదని ఆమె స్పష్టం చేశారు. అయినప్పటికీ సిరీస్‌లో తన వివరాలను వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుకున్నారని అన్నారు.

2022లో ఎమ్‌ఎక్స్ ప్లేయర్‌లో విడుదలైన ఈ వెబ్‌ సిరీస్‌లో ఏడు ఎపిసోడ్‌లు ఉన్నాయి. కమ్యూనిస్టు కార్యకర్త హత్య నేపథ్యంగా సాగిన రివెంజ్ డ్రామా ఇది. ఈ సిరీస్ నిర్మాతగా వర్మ వ్యవహరించారు. అంజనా సిన్హా తెలిపిన ప్రకారం “దహనం” లో హింసాత్మక, లైంగిక కంటెంట్ ఉండగా, వాటికి తన ప్రొఫెషనల్ ఐడెంటిటీని అనుసంధానం చేయడం వల్ల తన ప్రతిష్ఠ, గౌరవం, వృత్తి పరమైన స్థానం దెబ్బతిన్నాయని అన్నారు. దీని వలన తనకు మానసికంగా కూడా తీవ్ర ఇబ్బంది కలిగిందని పేర్కొన్నారు.

ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు సెప్టెంబర్ 10న నిర్మాత, దర్శకులపై ఐపీసీ సెక్షన్లు 509, 468, 469, 500, 120(B) కింద కేసు నమోదు చేశారు.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో అనేక కేసులు ఎదుర్కొంటున్న ఆర్జీవీకి, ఈ కొత్త ఫిర్యాదు మరొక తలనొప్పిగా మారింది. ఈ వ్యవహారంపై పోలీసులు ఎలా ముందుకు వెళ్తారో అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

సీరిస్ లో ఏముంది

రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా తెరకెక్కించిన తొలి వెబ్‌ సిరీస్‌ ‘దహనం’.. ‌ 2022లో ఏప్రిల్‌ 14న విడుదలైన ఈ మూవీని దర్శకుడు అగస్త్య మంజు తెరకెక్కించారు. అయితే, ఇందులో ఫ్యూడలిస్టులు, నక్సలైట్లకు మధ్య జరిగే పోరాటాన్ని తెరకెక్కించారు. ఓ కమ్యూనిస్ట్‌ నేత రాములును ఏ విధంగా హత్య చేశారు.. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న ఓ కొడుకు కథగా ఈ వెబ్‌ సిరీస్‌ను నిర్మించారు.

, , , , ,
You may also like
Latest Posts from