జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం (Pahalgam Terror attack)లో ఉగ్రవాదులు జరిపిన మారణహోమం ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఈ దాడిలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయాలతో బయటపడ్డారు.
పర్యటన నిమిత్తం జమ్మూకశ్మీర్‌కు వెళ్లిన కేరళ హైకోర్టు న్యాయవాదులు (Kerala High Court judges), ఎమ్మెల్యేలు (MLAs) ముష్కరుల దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నారు. ఈ ఘటనపై దేశ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక ఇప్పుడు ఈ వ్యతిరేకత ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ చిత్రం వైపు తిరిగింది.
దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌లో ప్రభాస్ ‘ఫౌజీ’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇమాన్వి నటిస్తోంది. అయితే, ఇప్పుడు ఈ సినిమాలో నుంచి ఆమె తొలగించాలంటూ సోషల్ మీడియాలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. #Boycott Prabhas అంటూ కొందరు ట్రెండ్ చేయటం మొదలెట్టారు.
ఇమాన్వి తండ్రి మాజీ పాకిస్థాన్ మిలిటరీ అధికారి కావడంతో ఇలాంటి వారిని ఇండియన్ సినిమాల్లో నటింపజేయవద్దంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఇమాన్వి పుట్టి పెరిగింది ఢిల్లీలో. అక్కడే చదువుకుని, మోడలింగ్, యాక్టింగ్ నేర్చుకుంది.
పాక్‌తో ప్రత్యక్ష సంబంధం ఉన్నవారిని ఇండియన్ సినిమాల్లో తీసుకుంటే అభ్యంతరం కానీ, ఇలా ఢిల్లీలో పుట్టిపెరిగిన అమ్మాయికి ఇక్కడ ఛాన్స్ ఇవ్వకూడదనేది ఏమాత్రం కరెక్ట్ కాదని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం పహల్గాం దాడితో ఫౌజీ చుట్టూ వివాదం రేగడం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది.