తమిళ సినిమా పరిశ్రమను విషాదంలో ముంచేసిన ఘటన ‘వెట్టువం’ షూటింగ్‌ సమయంలో జరిగింది. స్టంట్ మాస్టర్‌గా దశాబ్దాల అనుభవం కలిగిన మోహన్‌రాజ్, షూట్ లో ఉండగా ప్రాణాలు విడిచిన తీరు ఇప్పుడు సినిమా పరిశ్రమ మొత్తం సురక్షిత చట్టాలపై మళ్లీ చర్చకు దారితీస్తోంది.

ప్రముఖ నటుడు ఆర్య హీరోగా, దర్శకుడు పా. రంజిత్ దర్శకత్వంలో నీలం ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ “వెట్టువం”లో జరుగుతున్న ఓ డేంజరస్ కారు స్టంట్ ఒక్క క్షణంలోనే విషాదంలోకి మారింది. నాగపట్నం జిల్లాలో వేదమావడి గ్రామంలో చిత్రీకరిస్తున్న సమయంలో, ఓ కారు పల్టీ కొట్టే సన్నివేశంలో పాల్గొన్న మోహన్‌రాజ్, కారు ఆగిన వెంటనే అపస్మారక స్థితిలో పడిపోయారు. ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ, అప్పటికే ఆయన గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

గమనించదగిన విషయం ఏంటంటే – ఈ స్టంట్‌ను చేయొద్దని ఇప్పటికే కోర్డినేటర్ దిలీప్ సుబ్బరాయన్ హెచ్చరించినప్పటికీ, మోహన్‌రాజ్ మాత్రం తానే చేస్తానని గట్టిగా చెప్పినట్లు తెలిసింది. అందుకే ఈ ప్రమాదంలో ఆయన పాల్గొన్నాడు. అయితే ఇది నిజంగా వ్యక్తిగత నిర్ణయం కావచ్చునా, లేక ప్రొడక్షన్ ప్రెషర్ కూడా ఉన్నదా? అనే అనుమానాలు అందరిలో ఉద్ధృతమవుతున్నాయి.

ఈ ఘటనపై తీవ్ర స్పందన వ్యక్తం చేస్తున్న ఇండస్ట్రీ జనాలు, నెటిజన్లు, ఇప్పటికి ఏఐ, విఎఫ్ఎక్స్ వంటి టెక్నాలజీలు ఉన్నప్పటికీ, ప్రాణాల మీదకు వెళ్లే స్టంట్లు చేయించడం ఏ మేరకు సమంజసమో అని ప్రశ్నిస్తున్నారు. పా.రంజిత్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కీజాయూర్ పోలీసులు పా.రంజిత్‌తో పాటు యూనిట్‌లోని ఇతరులపై నిర్లక్ష్యంతో ప్రాణ నష్టం జరిగినదనే ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

స్టంట్ ప్రపంచంలో మోహన్‌రాజ్ తనకున్న స్థానం గురించి మాట్లాడిన నటుడు విశాల్ – “రాజ్ నాకు 20 ఏళ్లుగా తెలుసు. అత్యంత నిబద్ధతతో పని చేసే వ్యక్తి. ఇద్దరు పిల్లల తండ్రిగా కుటుంబానికి నిలువైన బలం. ఆయన హఠాన్మరణం నన్నెంతో కలిచివేసింది,” అంటూ భావోద్వేగంతో స్పందించారు. ఆయన కుటుంబానికి సహాయం అందిస్తామని కూడా హామీ ఇచ్చారు.

ఈ సంఘటన తరవాత కోలీవుడ్‌లో ఇప్పుడు ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి –

టెక్నాలజీ ఉన్నా, లైవ్ స్టంట్లపై సినిమా పరిశ్రమ ఇంకా ఎందుకు ఆధారపడుతోంది?

నటీనటులు, టెక్నీషియన్ల ప్రాణాలకు సంబంధించి ఎంతమేరకు భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నాయి?

ఒక స్టంట్ ఆర్టిస్ట్ “ఐ అండ్ విల్ డూ ఇట్” అన్నా – యూనిట్ అభిప్రాయాన్ని బలవంతంగా మారుస్తుందా? లేక ప్రొడక్షన్ డెడ్‌లైన్‌ మానవ విలువలకంటే ముఖ్యం అవుతోందా?

ఇకనైనా ఈ విషాద ఘటనలో పాఠాలు నేర్చుకుని, ఇండస్ట్రీ మొత్తంగా “సేఫ్టీ ఫస్ట్, షూట్ నెక్స్ట్” అనే మార్గంలో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని పరిశ్రమ ప్రముఖులు పిలుపునిస్తున్నారు.

ఈ విషాదం, మోహన్‌రాజ్‌కు నివాళిగా నిలిచిపోవాలని కాదు – పరిశ్రమ మొత్తం మారడానికి ఒక ప్రేరణగా నిలవాలని మాత్రమే ఆశించొచ్చు.

You may also like
Latest Posts from