పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైమ్ ఓ పూర్తిస్థాయి యోధుడిగా తెరపై కనిపించిన సినిమా ‘హరిహర వీరమల్లు: పార్ట్ 1 – స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. 17వ శతాబ్దం మొఘల్ పాలన నేపథ్యంలో రూపొందిన ఈ హిస్టారికల్ ఫిక్షన్ ఫిల్మ్, ఎన్నో వాయిదాల అనంతరం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్‌ – అన్నీ కూడా సినిమా మీద మంచి హైప్ క్రియేట్ చేయగా, ఇటీవల నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ తో ఆ హైప్ మరింత పెరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇది పవన్ కళ్యాణ్ తొలి పాన్-ఇండియా సినిమా. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ జరిగింది. మరి పవన్ చేసిన వీరమల్లు పాత్ర అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసిందా?

కథేంటి

ముస్లింల చక్రవర్తుల సంచారంతో భారతదేశపు గడ్డ మీద ఉలిక్కిపడిన కాలం అది. ఒకరి మతం కోసం మరికొరి పునాదులు నేలరాలిన రోజులు. అలాంటి వేళ, ఎక్కడికక్కడ నుండి చెలరేగుతున్న చిన్న చిన్న రెబెల్స్ కథలు — కొన్ని రాబిన్ హుడ్‌లా, కొన్ని సింహంలా. అలాంటి ఓ మట్టిబిడ్డే వీరమల్లు.

పల్లె నుంచి డిల్లీ పట్టణానికి వచ్చినవాడు కాదు. అతని పునాదిలోనే ఆగ్రహం ఉంది. కానీ, ఆగ్రహం కేవలం వ్యక్తిగతం కాదు – ఓ ధర్మం మీద దాడి జరిగితే గలగల కట్టిన ఓ ప్రళయం.

వజ్రాలను దోచుకుని లేనివారికి పంచే అజ్ఞాత వీరుడు ఒక వజ్రం కోసం కాకుండా… ఓ సాంప్రదాయం నిలబెట్టేందుకు ఢిల్లీకి వెళ్లే వేళ, కథ నడిపించేది గొప్ప మాస్టర్‌ప్లాన్ కాదు. భవిష్యత్తు లోతుల్లోనుంచి వినిపించే ప్రశ్నే — “ఇంతటి ధైర్యానికి మూలం ఏంటి?”

ఔరంగజేబు ఉన్మాదపు పాలన, పల్లెల్లో మతపరమైన పన్నుల బాదుడు, నాటి చరిత్రలో లెక్కలోకి రాని గమనాల మధ్య… ఓ పేరుగానీ, పునాదిగానీ లేని వ్యక్తి హరిహరవీర మల్లు (పవన్ కళ్యాణ్). అతను ఓ సారి పట్టుబడి అతడిని చంపకుండా ఒక పని అప్పచెప్తాడు నవాబు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు (బాబిడయోల్) దగ్గర ఉన్న కోహినూర్ కొట్టేసి తీసుకొచ్చేయమంటాడు. ఆ క్రమంలో గోల్కొండ నుంచి ఢిల్లీలోని ఔరంగజేబు రాజ్యానికి బయలుదేరుతాడు వీరమల్లు. ఇక ఈ ప్రయాణంలో వీరమల్లుకు ఎటువంటి దారుణ పరిస్థితులు ఎదురయ్యాయి? ఆ క్రమంలో సనాతన ధర్మ పరిరక్షణ కోసం వీరమల్లు ఏం చేశాడు? చివరకి ఏం జరిగింది? అనేదే మిగతా కథ.

ఎలా ఉంది

హరిహర వీరమల్లు కథను సాధారణ యోధుడి పోరాటంగా చూస్తే దానిలో గొప్పతనం కొద్దిగా మిస్‌ అయిపోతుంది. కానీ ఈ కథలోని అసలు స్పూర్తి – ఆయన వ్యక్తిగత ప్రయాణం కాదు, ఒక సంస్కృతికి కవచం దొరక్కపోతే అదే కవచం అయ్యిన ఓ మనిషి కథ.

మచిలీపట్నం నుంచి ఢిల్లీ దాకా – వజ్రాల కోసమో, ప్రేమ కోసమో కాదు… ధర్మ పరిరక్షణ కోసం వీరమల్లు సాగిన ప్రయాణం. ఇందులో ఔరంగజేబు సామ్రాజ్యం క్రూరత్వం, ప్రజల వేదన, జిజియా పన్నుల రూపంలో హిందూ దమన విధానం – ఇవన్నీ తెరపై నాటకీయతతో కాకుండా, కథలో భాగంగా ఒదిగిపోవాలి. అవన్ని ముక్కలు ముక్కలుగా కనపడుతూనే ఉంటాయి. కానీ ఓవరాల్ గా చూస్తే ఏమీ అనిపించదు. అదే స్క్రీన్ ప్లే సమస్యగా మారింది. ముఖ్యంగా సెకండాఫ్ ని దెబ్బ కొట్టింది.

అప్పటికి దర్శకుడు క్రిష్ హిస్టారికల్ స్కేల్‌ను ఎంతో ఆసక్తితో పునర్నిర్మించారు. అతని రీసెర్చ్, దృష్టి, ఫ్రేముల వెనుక ఉన్న రుచి – మొదటి సగం వరకూ స్పష్టంగా కనిపిస్తుంది. ఆపై జ్యోతికృష్ణ తీసుకున్న బాద్యతను ఆయన శైలిలో కాకుండా, చిత్రానికి గడ్డిపోసే శైలిలో మలిచారు.
ఈ మార్పు ప్రేక్షకుడికి అసహజంగా అనిపింస్తుంది. అది ఒక సహజమైన ట్రాన్సిషన్‌గా అనిపిస్తే మాత్రం ప్రత్యేకమైన విజయమే.

ఎవరెలా చేసారు

పవన్ కళ్యాణ్ – వీరుడే కాదు, విజన్‌కి ప్రతిరూపం అన్నట్లుగా మలిచే ప్రయత్నం చేసారు. వీర యోధుడిగా పవన్ ఎంట్రీ – అభిమానులకు goosebumps అనే పదాన్ని చిన్నగా చేస్తుంది. అతని ఆ కన్నీటి సన్నివేశం క్లైమాక్స్‌కి దగ్గరగా వచ్చే ఒక ఫ్రేమ్‌లో మాత్రమే కాదు – ఒక సంస్కృతి మీద అతని నిశ్ఛలమైన చూపులో కనిపిస్తుంది. ఇక హీరోయిన్ పాత్ర నామ మాత్రమే. బాబి డయోల్ మాత్రం ఔరంగజేబు పాత్రలో భయపెట్టే ప్రయత్నం చేసాడు. క్రూరమైన విలన్‌గా కనిపించాడు. ఆ పాత్రకు ఆయన పర్‌ఫెక్ట్ యాప్ట్ . జిషు సేన్‌గుప్తా, నాజర్, సత్యరాజ్, సునీల్, సచిన్ ఖేడేకర్ పాత్రలు కీలకమైనవి. ఈ సీనియర్స్ తమ నటనానుభవాన్ని ఉన్నంతలో ప్రదర్శించారు. అలాగే మిగిలినవారు వారి పాత్రల పరిధి మేరకు డీసెంట్‌గా నటించారు.

సాంకేతికంగా…

ఎమ్ ఎం కీరవాణి సంగీతం పటిష్టంగా నిలవాలి. కానీ జస్ట్ ఓకే అనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం బాగా ఇచ్చారు. పాటలు సోసోగా ఉన్నాయి. ప్రీ-క్లైమాక్స్ యాక్షన్ బ్లాక్స్ నుంచి క్లైమాక్స్ దాకా తీసిన విజువల్ స్కేల్ ఉందికానీ క్లైమాక్స్ మాత్రం దాన్ని చెదరకొట్టింది. విఎఫ్ ఎక్స్ మాత్రం బాగా వీక్. సినిమాకు అవే ప్రాణమై నిలవాలి.కానీ ఫలితం లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ సోసోగా ఉన్నాయి. దర్శకులు ఇద్దరు అవ్వటంతో సింక్ సరిగ్గా లేదు.

చూడచ్చా

అప్పటి కాల పరిస్దితులను చూడటానికి ఓ లుక్కేయచ్చు. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆయన నటన మెప్పిస్తుంది. అయితే ఇలాంటి సినిమాలు థియేటర్ లో చూస్తేనే బాగుంటాయి.

ఫైనల్ గా …

“కథ ఒక పాత్రను బలంగా చూపాలి. కానీ గ్రేట్ సినిమా ఆ పాత్ర వెనుక ఉన్న సమాజాన్ని చూపాలి” – అని చెప్పినట్టుగా,
హరిహర వీరమల్లు ఒక వీరుడి గురించి కాదు. ఒక విలువను నిలబెట్టిన గమనాన్ని గురించి. అన్ని అడ్డంకుల్ని దాటి, ఒక సినిమానే కాకుండా, ఒక బాధ్యతగా రూపొందించాల్సిన చిత్రం. తడబాట్లు,పొరపాట్లు,లోటు పాటులు ఎక్కువయ్యాయి.

, , , , , ,
You may also like
Latest Posts from