ఏదైనా భాషలో హిట్టైన సినిమాలను రీమేక్ చేస్తూంటారు. అయితే రీమేక్ అద్బుతంగా కుదిరినా సరే ఒరిజనల్ తో పోల్చి చూస్తూంటారు సామాన్యంగా. ఇదే పద్దతిలో వెబ్ సీరిస్ లు సైతం రీమేక్ చేస్తే అదే సమస్య వస్తుంది. ‘సివరపల్లి’ తెలుగు వెబ్ సిరీస్.. హిందీలో హిట్ అయిన పంచాయత్‌కు రీమేక్‌గా తెలుగులో రూపొందింది. ఈ వెబ్ సిరీస్‌కు భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించారు. రాగ్ మయూర్, రూప లక్ష్మి, మురళీధర్ గౌడ్, సన్నీ పల్లె, ఉదయ్ గుర్రాల, పావని కరణం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్‌సిరీస్ మొదటి సీజన్ ఎనిమిది ఎపిసోడ్‌లతో జనవరి 24 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
తెలుగు నుంచి వచ్చిన మరో మంచి తెలంగాణ సిరీస్ ఇది అని కొందరు మెచ్చుకుంటూంటే మరో ప్రక్క ఒరిజనల్ తో పోల్చి ఆ సీరిస్ లో ఉన్న సహజత్వం, డెప్త్ లేవని అంటున్నారు.
ఈ సీరిస్ లో విలేజ్ వాతావరణం .. విచిత్రమైన మనుషుల మధ్యకు విలేజ్ సెక్రటరీగా ఉద్యోగంతో వచ్చిన యువకుడు, అక్కడి ఊళ్లే అయిష్టంగా ఉంటూ తనపని తాను చేసుకుంటూ .. వీలైనపుడు చదువుకుంటూ ఆ తర్వాత ఫారిన్ వెళ్లిపోవాలనే ఆలోచనలో ఉంటాడు. కానీ.. పల్లెటూరి లైఫ్ స్టైల్ అంటే ఎంతమాత్రం ఇష్టం ఉండని ఇతడు, సాధ్యమైనంత త్వరగా అక్కడి నుంచి వెళ్లిపోవడం కోసం రాజీలేని పోరాటం చేస్తుంటాడు. ఈలోగా అక్కడ అతనికి ఎదురయ్యే సమస్యలు .. సంఘటనలే ఈ కథ.
‘పంచాయితీ ఆఫీసు’ను కేంద్రంగా చేసుకుని ఈ కథ నడుస్తూ ఉంటుంది. విలేజ్ లో పెద్దగా చదువుకోని మనుషులు .. వారి స్వభావాలు .. నమ్మకాలు .. ఆలోచనలను కలుపుకుంటూ సరదా సన్నివేశాలతో ఈ కథ సాగుతుంది. అక్కడి మనుషుల్లోని అమాయకత్వం .. మంచితనం .. ఒక్కోసారి ఇబ్బందిపెట్టే మనస్తత్వం.. ఇవన్నీ దర్శకుడు ఆవిష్కరించిన విధానం ఆకట్టుకుంటాయి.
‘సివరపల్లి’ .. టైటిల్ కి తగినట్టుగా .. ప్రధానమైన పాత్ర గ్రామానిదే అని చెప్పాలి. ఈ కథ ఊరంతా తిరుగుతుంది. అయినా తక్కువ పాత్రలకే ప్రాధాన్యతనిస్తూ, సహజత్వం దెబ్బతినకుండా కథను పరిగెత్తించిన తీరు మెప్పిస్తుంది. 8 ఎపిసోడ్స్ కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా నడుస్తాయి. సహజత్వానికి దగ్గరగా అనిపించే సన్నివేశాలు సరదాగా నవ్విస్తాయి.