90వ దశకంలో భారతీయ చిన్న తెరపై ఒక విప్లవం శక్తిమాన్ రూపంలో వచ్చింది. అప్పటి పిల్లల హృదయాల్లో సూపర్ హీరో అంటే శక్తిమాన్ మాత్రమే! దూరదర్శన్‌లో శనివారం ఉదయాన్నే టీవీ ముందు కూర్చుని శక్తిమాన్ కోసం ఎదురు చూడడం చాలామందికి ఇప్పటికీ తీపి జ్ఞాపకమే. ముఖేశ్ ఖన్నా పోషించిన శక్తిమాన్ పాత్ర ఒక జ్ఞానసింధువై, ధర్మానికి నిలువెత్తు ప్రతిరూపమై, అప్పటి తరానికి మార్గదర్శకంగా నిలిచింది.
రివైటల్ వరల్డ్‌లో శక్తిమాన్ రీ ఎంట్రీ!
ఇప్పుడు అదే శక్తిమాన్ మరోసారి జనాల ముందుకు వస్తున్నాడు – ఈసారి టీవీ తెరపై కాదు, మొబైల్ ఫోన్ లో, ఇయర్‌ఫోన్స్ లో! ముఖేశ్ ఖన్నా స్వయంగా వాయిస్ ఓవర్ ఇచ్చే శక్తిమాన్ ఆడియో సిరీస్ త్వరలో Pocket FM లో అందుబాటులోకి రానుంది. ఈ సిరీస్ గురించి ముఖేశ్ ఖన్నా మాట్లాడుతూ,
“శక్తిమాన్ కేవలం ఓ టీవీ షో కాదు – అది కోట్ల మందికి ఓ ఎమోషన్. ఇప్పుడు అదే శక్తిమాన్‌ను నూతన రూపంలో, నేటితరానికి అనువుగా తీసుకురావడం గర్వంగా ఉంది.”
పాత శక్తి – కొత్త ఫార్మాట్
1997 నుండి 2005 వరకు దూరదర్శన్‌లో సెన్సేషన్‌గా నిలిచిన ఈ సూపర్‌హీరో సిరీస్ ఇప్పుడు ఆడియో రూపంలో ప్రేక్షకులను ఆకట్టించేందుకు సిద్ధమవుతోంది. నూతన కథలు, ఆధునిక నేపథ్యం, మరియు శక్తిమాన్ విలువలను తిరిగి పరిచయం చేస్తూ… ఈ సిరీస్ వినిపించే ప్రతి ఎపిసోడ్ శక్తిని కలిగించనుంది.
ఇంతకాలం చూడ్డానికి ఉన్న శక్తిమాన్… ఇకపై వినిపించనున్నాడు. అదే శక్తి… కొత్త శబ్దంతో!