ఓటిటి సంస్దలు కొనటమే పరమావిధిగా సినిమా రంగం ముందుకు వెళ్తోంది.ముఖ్యంగా భారి బడ్జెట్ సినిమాలకు ఇది కామన్ అయ్యిపోయింది. అయితే బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం నటించిన తాజా చిత్రం ‘ది డిప్లొమాట్’ ని ఓటిటి సంస్దలు ఏమీ కొనటానికి ఉత్సాహం చూపించటం లేదట. ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ యాక్షన్ డ్రామా హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.
దీనిపై జాన్ అబ్రహం (John Abraham) తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సినిమాను తొలుత ఓటీటీ సంస్థలేవీ కొనలేదన్నారు. రిలీజ్ తర్వాత హిట్ కావడంతో వారి అంచనాలు తప్పని నిరూపితమైందని తెలిపారు.
జాన్ అబ్రహం మాట్లాడుతూ..‘‘ఈ సినిమా (The Diplomat) షూటింగ్ పూర్తయ్యాక స్టూడియోలను, ఓటీటీలను అడిగాం కానీ, ఎవరూ దీన్ని కొనడానికి ముందుకురాలేదు. స్టూడియో వాళ్లు ఓటీటీని సంప్రదించాలని అన్నారు. ఓటీటీ సంస్థలకు ఈ చిత్రం గొప్పగా అనిపించలేదు. దీంతో తిరస్కరించాయి. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంతోమంది ఈ చిత్రాన్ని ప్రశంసించారు.
దీంతో కొన్ని స్టూడియోలు, ఓటీటీలు ఈ సినిమా విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేదని వారికి అర్థమైంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం వందశాతం ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంది.
దీన్ని రిలీజ్ చేసిన నిర్మాణసంస్థ బ్యానర్‌పై గత పదేళ్లలో ఇంత గొప్ప సినిమా రాలేదని ప్రజలు అంటున్నారు. ఈ సినిమా క్లైమాక్స్‌లో థియేటర్‌లు చప్పట్లతో మారుమోగుతున్నాయి. ఇదే అసలైన విజయం అనిపించింది’’ అని జాన్ అబ్రహం అన్నారు.
‘ది డిప్లొమాట్’ విషయానికొస్తే.. శివమ్ నాయర్ దర్శకత్వంలో ఇది రూపొందింది. సాదియా, కుముద్ మిశ్రా, రేవతి తదితరులు కీలక పాత్రలు పోషించారు. భారతీయ దౌత్యవేత్త జేపీ సింగ్ నిజ జీవితం ఆధారంగా ఈ సినిమాను తీర్చిదిద్దారు. మార్చి 14న ఇది ప్రేక్షకుల ముందుకువచ్చింది.