

సినిమా ప్రేమికులకు శుభవార్త రానుందా? సెప్టెంబర్ 22, 2025 నుంచి అమల్లోకి రానున్న కొత్త GST స్లాబ్‌లు సినిమా టికెట్ ధరలపై ఏ విధమైన మార్పులు తెస్తాయనే విషయమై సినీ పరిశ్రమలో పెద్ద చర్చ మొదలైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన ఈ సవరణలు కాగితంపై చూస్తే ఊరటనిచ్చేలా కనిపిస్తున్నా, ఇండస్ట్రీలో వాస్తవ పరిస్థితులు మాత్రం వేరే దిశలో ఉన్నాయి. అవేంటో చూద్దాం.
కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ రేట్లను తగ్గించే దిశగా ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 22 నుండి కొత్త పన్ను స్లాబ్‌లు అమల్లోకి రానున్నాయి.
ఇప్పటి వరకు రూ.100 లోపు ఉన్న సినిమా టిక్కెట్లపై 12% జీఎస్‌టీ ఉండేది. ఇకపై అదే టిక్కెట్‌పై కేవలం 5% మాత్రమే పన్ను విధించనున్నారు. అంటే సింగిల్ స్క్రీన్ థియేటర్లు, చిన్న పట్టణాల్లో సినిమాలు చూడటం చౌకగా మారనుంది. అయితే వంద రూపాయల టిక్కెట్ల ఉన్న థియేటర్స్ ఎన్ని ఉన్నాయనేది పెద్ద క్వచ్చిన్.
ఎందుకంటే రూ.100 పైగా ధర గల టిక్కెట్లకు మాత్రం మునుపటిలాగే 18% పన్ను కొనసాగుతుంది.
దీని వల్ల ఏం లాభం?
7% పన్ను తగ్గింపుతో చిన్న థియేటర్లలో ప్రేక్షకుల రద్దీ పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే నిర్మాతలకే కాకుండా పంపిణీదారులు, థియేటర్ యజమానులు అందరికీ లాభం చేకూర్చే మార్పు అవుతుంది.
అయితే ఇక్కడే చిన్న మెలిక ఉంది..
₹100 లోపు టికెట్‌లపై GST 12% నుంచి 5%కి తగ్గించడం సింగిల్ స్క్రీన్‌లకు కాస్త ఉపశమనం కలిగించినా, పెద్ద క్లాసులు, మల్టీప్లెక్స్ సెగ్మెంట్ మాత్రం ఇప్పటికీ 18% GST పరిధిలోనే ఉండటం వల్ల అసలు మార్కెట్‌లో పెద్ద మార్పు జరగదని విశ్లేషకులు చెబుతున్నారు.
కొత్త GST స్లాబ్‌లు ప్రవేశపెట్టడం వల్ల సింగిల్ స్క్రీన్‌లకు కొంత ఊరట లభించవచ్చన్న అభిప్రాయం ఉన్నప్పటికీ, సమగ్రంగా చూసినప్పుడు ఈ సవరణలు టికెట్ ధరల వ్యవస్థను మార్చేంత ప్రభావం చూపే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మల్టీప్లెక్స్ అసోసియేషన్ డిమాండ్
మరో ప్రక్క మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మాత్రం రూ.300 లోపు టిక్కెట్లను కూడా 5% స్లాబ్ కిందకి తీసుకురావాలని కేంద్రాన్ని కోరుతోంది. ఎందుకంటే ఈ నిర్ణయం తీసుకుంటే మల్టీప్లెక్స్‌లలో కూడా టిక్కెట్ ధరలు గణనీయంగా తగ్గుతాయి. దాంతో నగరాల్లో సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య పెరగడంతో పాటు పరిశ్రమ మొత్తం మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఉండే అవకాశముందని భావిస్తున్నారు.