సిద్ధార్థ్ (నారా రోహిత్) వయస్సు అయ్యిపోతున్నా పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయి ఉంటాడు. నలబైల్లో పడుతూ ఏజ్ ని, లైఫ్ ని మ్యానేజ్ చేయాటనికి నానా ఇబ్బందులు పడుతూంటాడు. పెళ్లికాకుండా ఆగిపోవటానికి కారణం ఒకటే స్కూల్‌లో చదువుకునేటప్పుడు తన సీనియర్ వైష్ణవి(శ్రీదేవి)తో ప్రేమలో పడటమే. అప్పట్లో ఆమెలోని కొన్ని లక్షణాలు నచ్చుతాయి. అవన్నీ గుర్తు పెట్టుకుని పెద్దయిన తర్వాత అలాంటి లక్షణాలున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని రూల్స్ పెట్టుకుని జీవితాన్ని ముందుకు తోసేస్తాడు.
తన ఎన్నో సంబంధాలు వచ్చినా ఆ రూల్స్ ని, లక్షణాలను మైండ్ లో పెట్టుకుని అన్నీ రిజెక్ట్ చేస్తాడు. ఇప్పుడు తనను అందరు రిజెక్ట్ చేసే వయస్సు వచ్చేసింది. అయితే ఈ సారి అతని జీవితంలో వసంతం వచ్చే సమయం వచ్చేసింది. ఓసారి ఎయిర్‌పోర్ట్‌లో ఐరా(వృతి వాఘని) అనే అమ్మాయి కనపడుతుంది.
ఆమెలో తను అనుకున్న క్వాలిటీస్ ఉన్నాయని ఆమె వెంటపడతాడు. తనని ప్రేమించేలా చేస్తాడు. కానీ ఆమె తనకన్నా బాగా చిన్నది. అంతేకాదు ఈ ప్రేమ కథలో మరో ట్విస్ట్ ఉంది. అదేంటి..ఇంతకీ ఈ లవ్ స్టోరీ సుఖాంతమైందా? సిద్ధార్థ్ జీవితంలో వైష్ణవిని ఎందుకు కలవాల్సి వచ్చిందనేది, అసలు చివరకు ఏమైంది అనేదే మిగతా స్టోరీ.
ఎనాలసిస్
నేటి ప్రేక్షకుడు చాలా ఫాస్ట్‌గా మారిపోయాడు. “కొత్త పాయింట్ లేకపోతే సినిమా ప్రేక్షకుడి మనస్సుని పట్టుకోవడం లేదు” అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో రూల్‌లా మారింది. అందుకే దర్శకులు, నిర్మాతలు ఎప్పటికప్పుడు విభిన్నమైన కాన్సెప్ట్స్ కోసం వెతుకుతూనే ఉంటారు. అయితే, ఆ కొత్త పాయింట్ నిజంగానే విలువైనదా? దానిని స్క్రీన్‌పై ఎలా నెరవేర్చారు? అనేది మరో పెద్ద ప్రశ్న. “సుందరకాండ” ఇక్కడే ఒక డిబేట్ తెరపైకి తెస్తుంది.
సినిమా స్ట్రాంగ్ గా ఆధారపడింది ఎంటర్టైన్‌మెంట్ మీదే, కానీ కథ,కథనం మాత్రం చాలా పలచగా ఉంది. మొదటి అరగంట వరకూ హీరో క్యారెక్టర్, అతని ప్రపంచాన్ని చూపించే ఎపిసోడ్‌లు కొంచెం స్కెచ్‌లా అనిపిస్తాయి. కొన్ని సీన్స్ బాగానే ఉన్నా,అక్కడక్కడే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. కానీ హీరోయిన్ ఎంట్రీతో పాటు, సత్యా ఎంటరయ్యాక, బోరింగ్‌గా అనిపించే ట్రాక్ కూడా ఓకే అనిపించడం మొదలవుతుంది. కథ క్రమంగా ఇంటర్వెల్ వైపు నడుస్తుంది, అక్కడే అసలు ట్విస్ట్ దాగి ఉంటుంది. ఈ ట్విస్ట్ ముందే ఊహించని వాళ్లకు బాగా వర్కౌట్ అవుతుంది, కానీ చాలా మందికి అది సర్ప్రైజ్ కాకపోవచ్చు.
ఇంటర్వెల్ తర్వాత కథ మొత్తం ఆ ట్విస్ట్ మీదనే బేస్ అవుతుంది. అందులో భాగంగానే సినిమా లో ఉన్న ఎంటర్‌టైనింగ్, ఫన్నీ సన్నివేశాలు వస్తాయి. అయినప్పటికీ, కొన్ని డ్రామాటిక్ సన్నివేశాలు స్పీడ్ బ్రేకర్లలా పని చేస్తాయి. మొదట్లో ఓకే అనిపించినా, తరువాతికి ఆ డ్రామా కాస్త మెలికలు తిరిగినట్టుగా, కన్‌విన్సింగ్ కాకుండా అనిపిస్తుంది. ముఖ్యంగా హీరో తన తప్పు గ్రహించే ఎపిసోడ్ ఫోర్స్‌డ్‌గా అనిపించడం వల్ల ఎమోషన్ అసలైన బలం అందుకోలేకపోతుంది.
ఇంటర్వెల్ ట్విస్ట్ వర్కౌట్ అవుతుంది, కొంత ఫన్ కూడా ఉంది. కానీ లోతు లేకపోవడం వల్ల ఈ సినిమా “కొత్తదనాన్ని చూపినంతలో ఆగిపోయింది, నిజంగా కొత్త అనుభూతిని ఇవ్వలేకపోయింది” అనిపిస్తుంది. “కొత్త పాయింట్ వెతికితేనే విజయం అని కాదు, ఆ పాయింట్‌ని స్క్రీన్‌పై ఎంత బలంగా నెరవేర్చామన్నదే అసలు పరీక్ష” – ఈ నిజాన్ని గుర్తు చేసే ప్రయత్నమే సుందరకాండ.
టెక్నికల్ గా..
టెక్నికల్‌గా చెప్పుకోవాల్సిందిగా పెద్దగా ఏం లేదు. ప్రత్యేకమైన క్రాఫ్ట్ లేదా హైలైట్ కోసం ప్రయత్నించకుండా, సినిమా పూర్తిగా ఫంక్షనల్ ఎగ్జిక్యూషన్‌కే పరిమితమైందని చెప్పాలి. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. పాటలు వినడానికి బాగానే ఉంటాయి, కథనంలో సరిగ్గా సెట్ అవుతాయి. అవి సినిమా ఫ్లోని ఆపకుండా ముందుకు నడిపిస్తాయి. అయితే, మొదటి సారి విన్నప్పుడే మదిలో నిలిచిపోయే స్థాయిలో గుర్తుండిపోవు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం డీసెంట్‌గా ఉంది. అది ఫన్ ఎలిమెంట్స్‌కి బాగా సరిపోతూ, అతిగా అనిపించకుండా సపోర్ట్ చేస్తుంది. మిగతా విభాగాలు సోసోగా ఉన్నాయి. డైలాగులు మాత్రం బాగున్నాయి. ఫన్ బాగా పండింది.
నటీనటుల్లో..
నారా రోహిత్ గతంలో తన ఫిట్‌నెస్ లోపంపై విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే ఆ ఫీడ్‌బ్యాక్‌ను ఆయన సీరియస్‌గా తీసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కొంత గ్యాప్ తర్వాత పూర్తి మేకోవర్‌తో తిరిగి వచ్చి, మరింత ఫ్రెష్‌గా, ఫిట్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. సంప్రదాయపరంగా పెళ్లి వయస్సు దాటి వెళ్ళిన వ్యక్తి పాత్ర ఆయనకు బాగా సూటైంది. దానిని ఎంతో ఈజ్‌తో పోషించారు.
శ్రీదేవి విజయ్‌కుమార్ తన పాత్రలో ఎంతో ఎలిగెంట్‌గా, గ్రేస్‌ఫుల్‌గా మెరిశారు. డెబ్యూట్ హీరోయిన్ వృతి వఘాని కాలేజ్‌గాళ్ పాత్రలో పాస్ అయ్యేంత ఇంప్రెషన్ ఇచ్చింది. సత్య లైట్‌హార్ట్‌డ్ కామెడీతో అలరించగా, రోహిత్ సోదరిగా వసుకి బాగా ఆకట్టుకున్నారు.
ఫైనల్ గా..
మొత్తానికి “సుందరకాండ” – ఒక సగటు రొమాంటిక్ కామెడీ. కథలోని ట్విస్ట్ కాస్త కొత్తదనం తీసుకొచ్చినా, డ్రామా సరిగా వర్కౌట్ అవ్వక uneven narrative గా అనిపిస్తుంది. సరదాగా, పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తే మాత్రం బాగుందనిపించే సినిమా.