సినిమా పరిశ్రమ – వెలుగులు, చీకట్లు కలిసి ఉన్న రంగస్థలం. ఒక్కో సినిమా ఓ నటుడు, దర్శకుడు, నిర్మాత జీవితాన్ని ఎత్తేసేలా చేస్తే… మరో సినిమా అదే జీవితాన్ని తలకిందులయ్యేలా చేస్తుంది. పేరు, గౌరవం, సంపద అన్నీ సముద్రంలో తేలుతున్న పడవలా మారిపోతాయి. తెలుగు సినిమా తొలి తరం స్టార్ హీరోయిన్ అంజలీదేవి జీవితంలోనూ అలాంటి మలుపులు ఉన్నాయి. ఒక్క సినిమాతో ఆవిడ జీవితంలో సంపాదించింది మొత్తం పోయింది. అదెలా జరిగిందో చూద్దాం.
1940లలోనే నటిగా కెరీర్ ప్రారంభించిన అంజలీదేవి, చిన్ననాటి నాటక ప్రదర్శనల అనుభవంతో మద్రాసుకు చేరుకుని ‘గొల్లభామ’ సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ తరువాత ఆమె ‘కీలుగుర్రం’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి, అగ్రనటిగా స్థిరపడ్డారు. ఆనాటి స్టార్ హీరోలందరితోనూ ఆమె జంటగా నటించారు. సంగీత దర్శకుడిగా పేరున్న పుట్టపర్తి ఆదినారాయణరావుతో కలిసి ఆమె నిర్మాతగానూ మారారు. హిందీలో ‘ఫూలోంకీ శేజ’ అనే చిత్రాన్ని నిర్మించారు. అందులో అశోక్ కుమార్, మనోజ్ కుమార్, వైజయంతిమాల లాంటి ప్రముఖులు నటించారు.
అయితే ఆ చిత్రం నిర్మాణ వ్యయం ఆశించిన దానికంటే ఎక్కువైపోయింది. విడుదల తర్వాత ఆ సినిమా ఫలితం నిరాశ కలిగించడంతో, వారిద్దరూ తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయారు. అప్పటివరకు సంపాదించిన ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వచ్చింది. కానీ అంజలీదేవి తలవంచకుండా మళ్లీ కష్టపడి లేచి నిలబడ్డారు. ఆమె నటించిన ‘సతీ సక్కుబాయి’, ‘భక్త తుకారాం’ వంటి చిత్రాలు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి.
అంజలీదేవి ఆర్థికంగా కష్టాల్లో ఉన్న విషయాన్ని తెలిసిన తమిళ సినీ దిగ్గజం శివాజీ గణేశన్, ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ‘భక్త తుకారాం’ చిత్రంలో తుకారాముగా నటించడం అప్పటి సినీ స్నేహబంధాలకు నిదర్శనం.
ఇలాంటి అనుభవాలే సినీ రంగం ఎంత అనిర్వచనీయమో చెప్పే ఉదాహరణలు. ఒక్క సినిమా విజయమో.. అపజయమో, ఎన్నో జీవితాలను మలుపుతిప్పే శక్తి cinema కి ఎంత ఉందో చెప్పకనే చెబుతాయి.