ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు (Ram Gopal Varma) ముంబయి కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. చెక్ బౌన్స్ కేసుకు సంబంధించి అంధేరీ మెజిస్ట్రేట్
వర్మపై నాన్బెయిలబుల్ వారెంటు జారీ చేసింది. మూడు నెలల్లో ఫిర్యాదుదారుడికి రూ.3.7 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అలా చేయని పక్షంలో మరో మూడు నెలలు సాధారణ జైలు శిక్ష విధిస్తామని కోర్టు స్పష్టం చేసింది. 2018లో మహేశ్ చంద్ర అనే వ్యక్తి వర్మపై ఈ చెక్ బౌన్స్ కేసును వేశారు.
రామ్ గోపాల్ వర్మ కు ఎన్ని సార్లు నాన్ బెయిలబుల్ వారెంట్స్ జారీ చేసినా ఆయనకోర్టుకు హాజరు కాలేదు.
2022లో ఓ సారి ఇలాగే ఆయనపై వారెంట్ జారీ అయితే కోర్టుకు హాజరై ఐదు వేల రూపాయలు పూచికత్తు ఇచ్చి బెయిల్ తెచ్చుకున్నారు. మళ్లీ కోర్టుకు హాజరు కావడం మానేశారు. ఇప్పుడు కోర్టు విచారణ పూర్తి చేసి ఆయనకు మూడు నెలల జైలు శిక్ష విధించింది.
అయితే చెక్ బౌన్స్ కేసులో మొత్తం చెల్లించాల్సింది మూడు లక్షల డెబ్భై రెండు వేల రూపాయలు మాత్రమే.
ఇటీవల ఏపీ ప్రభుత్వంలో ఆయన ఓ స్కాం చేశారని కూడా వార్తలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కోసం తీసిన రెండు సినిమాలను ఏపీ ఫైబర్ నెట్ లో రిలీజ్ చేసి కోటిన్నర తీసుకున్నారని అన్నారు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని లేకపోతే కేసులు పెడతామని ఫైబర్ నెట్ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులపై ఏం స్పందించారో ఇంకా స్పష్టత రాలేదు.