
రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ రివ్యూ
హైదరాబాద్‌లో తన భార్య బాలామణి (డింపుల్ హయతి) తో కలిసి వైన్ బిజినెస్ చేసే రామ్ (రవితేజ).. తను తయారు చేసిన ‘అనార్కలి’ బ్రాండ్‌ను వరల్డ్ ఫేమస్ చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో స్పెయిన్‌లోని పెద్ద కంపెనీ యజమాని మానస (ఆషికా రంగనాథ్) ని కలవడానికి అక్కడికి వెళ్తాడు. అక్కడ విందా అలియాస్ బెల్లం (సత్య) సృష్టించే అడ్డంకులను దాటుకుంటూ మానసకు చేరువవుతాడు.
రామ్ మంచితనం చూసి మానస మనసు పారేసుకుంటుంది. ఆ మత్తులో ఒక రాత్రి ఇద్దరూ శారీరకంగా ఒక్కటవుతారు. ఏకపత్నీ వ్రతుడిగా పేరున్న రామ్.. ఆ మత్తులో తన భార్య విషయాన్ని మానసకు చెప్పకుండా పెద్ద తప్పే చేస్తాడు.
పని ముగించుకుని గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్ వచ్చేసిన రామ్.. మళ్ళీ తన భార్యతో అన్యోన్యంగా సంసారం సాగిస్తుంటాడు. కానీ, అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది! రామ్‌ను వెతుక్కుంటూ మానస హైదరాబాద్ వచ్చేస్తుంది. అప్పటివరకు భార్య తప్ప మరో మహిళను కన్నెత్తి చూడని రామ్‌పై బాలామణికి అనుమానాలు మొదలవుతాయి.
ఈ క్రమంలో ఏం జరుగుతుంది… రామ్ పెళ్లయిన వాడని తెలిసినప్పుడు మానస రియాక్షన్ ఏంటి? తనను మోసం చేసిన రామ్‌పై ఆమె ప్రతీకారం తీర్చుకుందా లేక ప్రేమతో వదిలేసిందా? భర్త చేసిన నిర్వాకం తెలిసినప్పుడు బాలామణి రియాక్షన్ ఏంటి? ఇద్దరు భామల మధ్య మన మాస్ రాజా పడిన కన్ఫ్యూజన్ డ్రామానే ఈ సినిమా అసలు కథ!
విశ్లేషణ
ఈ సినిమా కేవలం రవితేజ మార్క్ కామెడీ మాత్రమే కాదు.. భార్యను కాదని బయట ఎంజాయ్ చేయాలనుకునే భర్తలకు ఒక హెచ్చరిక లాంటిది. ఒక చిన్న వైన్ బిజినెస్ కోసం మొదలైన కథ.. రామ్ జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పింది? మానస ప్రేమను రామ్ అంగీకరించాడా? అనే ప్రశ్నలకు సమాధానంగా స్క్రిప్టు రాసుకున్నాడు దర్శకుడు. అయితే ఇలాంటి కథలతో ఇప్పటికే బోలెడు సినిమాలు వచ్చేసాయన్న సంగతి తెలియకుండా ఉండదు. అయినా ధైర్యంగా ముందుకు వెళ్లాడు. హీరోని, దర్శకుడుని ఒప్పించి తను అనుకున్న కథను తెరకెక్కించాడు. దాంతో దర్శకుడు ఇంత రొటీన్ కథలో నమ్మిన యుఎస్ పి ఏమిటనే ప్రశ్న కలగక మానదు.
దర్శకుడుగా కిశోర్ తిరుమలకు ఓ ఫార్మెట్ ఉంది. సింపుల్ డ్రామా, రిలేషన్షిప్ డైనమిక్స్, లైట్ హ్యూమర్, ఎమోషనల్ అండర్‌కరెంట్. కానీ ఈసారి ఆయన తీసుకున్న ఈ కథలో కొత్తదనం కొంచెం కూడా లేదు. అయితే ఈ సినిమా ఆయన చేసిన ముఖ్యమైన ప్రయత్నం ఏంటంటే రవి తేజను మాస్–యాక్షన్ మేజ్ నుంచి బయటికి తీసుకురావడం. చాలా కాలం తర్వాత రవి తేజ ఫ్యామిలీ డ్రామాలో, లైట్ ఎంటర్టైనర్లో, యాక్షన్ ఎపిసోడ్లు, మాస్ డైలాగ్స్, విలన్ గ్యాంగ్స్ లేకుండా కనిపిస్తాడు. ఈ పరంగా చూస్తే, ఈ సినిమా ఆయన తాజా ఫిల్మోగ్రఫీలో రిఫ్రెషింగ్ చేంజ్ లా అనిపిస్తుంది. అదే కిషోర్ తిరుమల నమ్మిన యుఎస్ పి అయ్యిండవచ్చు.
ప్లాట్ పరంగా ఈ సినిమా పూర్తిగా పాత టెంప్లేట్కే కొత్త ప్యాకేజింగ్ చేసే ప్రయత్నం చేసారు. అంటే పాత శోభన్ బాబు, జగపతిబాబు, వెంకటేష్ స్టైల్ ఫ్యామిలీ డ్రామాల తిరిగి అందించటం. ఓ మంచి భర్త, విదేశీ ట్రిప్ – చిన్న తప్పిదం. ఆమె కొంతకాలానికి తిరిగి రావడం – కుటుంబంలో తుఫాన్ అనే టెంప్లేట్‌ని మళ్లీ వాడారు. కిశోర్ తిరుమల ఈ పాత కథని లైట్ టోన్‌లో, ఎంటర్టైనింగ్ ప్యాకేజింగ్‌తో. నరేట్ చేయడానికి ప్రయత్నించారు. అంతా బాగానే ఉంది కానీ క్లైమాక్స్‌లో హీరో “ప్రతి భర్త తన అంతరాత్మ మాట వినాలి” అనే విజ్ఞప్తి చేస్తాడు. ఏదైతే ఆ వాయిస్ చెప్పిందో అదే ముగింపు. అంతరాత్మ అనే కాన్సెప్ట్‌ను డ్రామాటిక్ సిట్యుయేషన్లలో బిల్డ్ చేయకపోవటంతో అది వర్కవుట్ కాలేదు.
టెక్నికల్ గా..
భీమ్స్ మంచి క్యాచీ పాటలు ఇచ్చాడు. అద్దం ముందు, బెల్లా బెల్లా, వామ్మో వాయ్యో పాటలు బాగా వర్క్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ విల్యూస్ చాలా రిచ్‌గా ఉన్నాయి. కానీ నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ అయిన శ్రీకర్ ప్రసాద్ కూడా సెకండ్ హాఫ్‌లో ఉన్న కొన్ని అనవసర సీన్లను కట్ చేయకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అవే కథను లాగినట్టు చేశాయి. రైటర్-డైరెక్టర్‌గా కిశోర్ తిరుమల కొంతవరకే సక్సెస్ అయ్యాడు – కొన్ని చోట్ల మాత్రమే ఆయన స్టైల్ పనిచేసింది.
నటీనటుల్లో ..
రవి తేజ యాక్షన్, మాస్ లేకుండా ఫ్రెష్ పాత్రలో బాగా చేశాడు. భార్య–లవర్ మధ్య ఇరుక్కున్న మగాడు గా న్యాయం చేశాడు, లుక్ కూడా ట్రెండీగా ఉంది. డింపుల్ హయతి నీట్‌గా ఉంది. ఆశికా గ్లామర్‌గా కనిపించింది కానీ ఎక్స్ప్రెషన్స్ మెరుగుపర్చుకోవాలి. సత్య మొదట నవ్విస్తాడు, తర్వాత రిపీట్ అవుతుంది. వెన్నెల కిషోర్ తన పాత్రకు సరిపోయాడు. సునీల్ భీమవరం ఫ్లాష్‌బ్యాక్‌లో బాగా నవ్విస్తాడు. రోహన్ కొద్దిగా హాస్యం ఇస్తాడు, మురళీధర్ గౌడ్ భాగం మాత్రం గుర్తుండదు.
ఫైనల్ గా…
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మంచి ఉద్దేశంతో తీసిన సినిమా. రవి తేజను మాస్–యాక్షన్ మోల్డ్ నుంచి బయటకు తీసి, ఫ్యామిలీ డ్రామా మరియు లైట్ ఎంటర్టైనర్ జోన్లో చూపించాలన్న కిశోర్ తిరుమల ప్రయత్నం అభినందనీయం. కొన్ని చోట్ల ఫన్ బాగానే పనిచేస్తుంది. కానీ స్క్రిప్ట్‌కి అవసరమైన కొత్తదనం, బలమైన కాన్ఫ్లిక్ట్, లోతైన క్యారెక్టర్ ఆర్క్, భావోద్వేగమైన క్లైమాక్స్ లేకపోవడంతో సినిమా “బాగుంది” అనే స్థాయిని దాటలేకపోయింది. పాత టెంప్లేట్‌పై నడిచిన కథ, ముందే ఊహించగలిగే ముగింపు, రన్‌టైమ్‌ను లాగించే ఎపిసోడ్లు… ఇవన్నీ కలిసి దీనిని కేవలం ఒక ఓకే ఫెస్టివ్ ఎంటర్టైనర్గా పరిమితం చేశాయి.
