సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానా దగ్గుబాటి తొలి సినిమాగా 2010లో వచ్చిన లీడర్ ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలసిందే. పొలిటికల్ డ్రామా జానర్లో వచ్చిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందినప్పటికీ, అప్పట్లో ఒక ప్రచారం బలంగా వినిపించింది – “ఈ కథ వైఎస్ జగన్, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిల జీవితాన్ని ఆధారంగా చేసుకుని తీశారని!”. ఇప్పుడు ఆ వార్తలకు శేఖర్ కమ్ముల ఇంతకాలానికి స్వయంగా ఫుల్ స్టాప్ పెట్టారు. తాజా ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ముల తేల్చి చెప్పారు:
“జగన్ కి సంబంధం లేదు – ఇది ఫిక్షన్ కథ” అని స్పష్టం చేసిన శేఖర్
“హ్యాపీ డేస్ తర్వాత ఏ సినిమా చేయాలి అన్న ఆలోచనలో సంవత్సరం గడిచిపోయింది. పొలిటిక్స్ పట్ల నాకు ఆసక్తి ఉంది. పత్రికలు చదువుతాను. ఆ అంశాల మీద మంచి అర్థం ఉంది. రాజకీయాల్లో నిజాయితీగా వ్యవహరించే నాయకుడు ఎలా ఉండాలి అనేది చూపించాలనిపించింది. అప్పుడే ‘లీడర్’ కథా ఆలోచన మొదలైంది.”
“కథకు వైఎస్ జగన్ తో సంబంధం లేదు. సినిమా షూటింగ్ 70 శాతం పూర్తయ్యే వరకూ రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. ఆ టైంలో జగన్ సీఎం అవుతారనే ఆలోచన కూడా లేదు. ఆయన పాత్ర లేదా ఇన్స్పిరేషన్ ఎక్కడా లేదు.”
“అమెరికా నుంచి వచ్చిన, మంచి విలువలున్న వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందో ఆలోచిస్తూ కథ రాశాను. నిజాయితీతో ప్రజలకు సేవ చేస్తే విజయం లభిస్తుందని నమ్మే వ్యక్తిగా కథను డిజైన్ చేశాను. ఈ కథ పూర్తిగా నా ఊహలో పుట్టినదే. ఎలాంటి బయోగ్రఫికల్ ఎలిమెంట్లు లేవు” అంటూ వివరంగా చెబుతూ రూమర్లకు ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని సినిమాని ఆయనకు చూపించాలని ఆశించానో తప్ప, కథను జగన్ కుటుంబానికి అనుసంధానించలేదు అని స్పష్టం చేశారు శేఖర్.