ఆమిర్ ఖాన్ మళ్లీ తనదైన స్టైల్‌లో ఒక వినూత్న ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘సితారే జమీన్ పర్’ — తాను హీరోగా నటించిన స్పోర్ట్స్ కామెడీ డ్రామా, జూన్ 20న విడుదలై హిట్ టాక్‌తో పాటు బాక్సాఫీస్ దగ్గర సైతం మంచి విజయాన్ని నమోదు చేసింది. ప్రేక్షకులు, విమర్శకులు సినిమాకు కలసి చప్పట్లు కొట్టారు.
ఎమోషన్, వినోదం, స్పూర్తి అన్నీ కలిపిన ఈ చిత్రానికి mouth publicity బాగా కలిసొచ్చింది. సినిమా తొలి రెండు వారాల్లోనే దేశవ్యాప్తంగా ₹65 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. బాలీవుడ్ పాన్-ఇండియా హంగులు లేకుండానే, కంటెంట్ పరంగా క్లీన్ గా నిలిచింది.
ఈ విజయం తర్వాత కూడా ఆమిర్ ఖాన్ చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాను ఏ ఓటీటీ సంస్థకూ ఇవ్వకుండా, నేరుగా యూట్యూబ్‌లో విడుదల చేయనున్నాడు.
ఆగస్టు 1 నుండి, భారతదేశంలో ₹100 అద్దె ధరకు ఈ సినిమా యూట్యూబ్‌లో అందుబాటులో ఉంటుంది. విదేశాల్లో అయితే ప్రదేశాన్ని బట్టి అద్దె ధర మారుతుంది.
“సినిమా అన్ని డివైజ్‌లలో, అందరికీ చేరే ప్లాట్‌ఫార్మ్ యూట్యూబ్ మాత్రమే. అందుకే ఇక్కడ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాను. ప్రేక్షకుడికి తక్కువ ధరలో మంచి సినిమా ఇవ్వాలన్నదే నా కల,” అంటూ విలేకరుల సమావేశంలో ఆమిర్ పేర్కొన్నారు.
కేవలం ఆటే కాదు… జీవితపు గేమ్
కథా నేపథ్యం గుల్షన్ అరోరా (ఆమిర్ ఖాన్) అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది.
ఢిల్లీ బాస్కెట్‌బాల్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న అతను, ఓ సంఘటన వల్ల కోర్టు శిక్షకు గురవుతాడు.
తీవ్రంగా ఆత్మకేంద్రితుడిగా, అసహనంగా, బలంగా ఉండే గుల్షన్… మానసిక దివ్యాంగ పిల్లల బాస్కెట్‌బాల్ కోచ్‌గా మారుతాడు.
ఈ శిక్షణ — ఆ పిల్లలపై మాత్రమే కాక, అతని మీద కూడా మార్పు తీసుకొస్తుంది.
జీవితంపై అతను కొత్త దృక్కోణాన్ని అలవరుచుకుంటాడు.
తన భార్య సునీత (జెనీలియా) తో మనస్పర్థల వల్ల విరిగిపోయిన సంబంధాన్ని తిరిగి నిలబెట్టే ప్రయత్నంలోకి వస్తాడు.
ఇంతలో, అతను కోచ్ చేసిన ‘సితారే’ టీమ్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌కి అర్హత సాధించి, అక్కడ గెలిచిందా లేదా? అన్నదే కథ సారాంశం.
ఒక హ్యూమన్ స్టోరీకి కమర్షియల్ హీట్
ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ చిత్రం… సాధారణ స్పోర్ట్స్ డ్రామాలా కాకుండా, భావోద్వేగాలతో నిండిన వ్యక్తిత్వ మార్పుల కథ.
సమాజం పట్ల, దివ్యాంగుల పట్ల ఉన్న అపోహల్ని సున్నితంగా తాకుతూ, ప్రేక్షకుడి మనసుని గెలుచుకుంది.
ఫైనల్ గా ..
‘సితారే జమీన్ పర్’ చూసినవారు, అది ఎమోషన్‌తో నిండి ఉన్న స్పోర్ట్స్ కామెడీ మాత్రమే కాదని చెబుతారు.
అది మనిషిలో మార్పు ఎలా వస్తుందో తెలిపే చిత్రణ.
ఆమిర్ ఖాన్ తీసుకున్న డిజిటల్ మార్గం కూడా అలాంటిదే. అది ఒక ట్రెండ్ బ్రేకర్. ఒక ప్రశ్న.
“మనం సినిమాలను ఎలా చూడాలో” అనేదానిపై ఆలోచించాల్సిన అవసరం ఉందని చెబుతున్న మాట.