తెలుగులో గత కొంత కాలంగా ఫేక్ పోస్టర్స్, ఫేక్ కలెక్షన్స్ పై చర్చలు జరుగుతున్నాయి. దిల్ రాజు వంటి నిర్మాతలు తాము ఫేక్ కలెక్షన్స్ వేసామని బహిరంగంగానే ఒప్పుకుంటున్నారు. తాజాగా తండేలు చిత్రం వంద కోట్ల పోస్టర్ వేస్తే అది ఫేక్ కలెక్షన్స్ అని రచ్చ జరుగుతోంది. అదే సమయంలో హిందీలోనూ ఫేక్ కలెక్షన్స్ గురించి రచ్చ మొదలైంది. అక్షయ్‌కుమార్, వీర్ పహారియా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘స్కై ఫోర్స్’కు ఫేక్ కలెక్షన్స్ వేస్తున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కలెక్షన్స్‌పై వస్తోన్న ఆరోపణలపై దర్శకుడు సందీప్ కేవ్లానీ స్పందించారు. ఆ వార్తల్లో నిజం లేదని అన్నారు.
సందీప్ మాట్లాడుతూ…‘‘కలెక్షన్స్ విషయంలో మేము తప్పుడు సమాచారం ఇస్తున్నామని పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు. అందులో నిజం లేదు. ఫేక్ పోస్టర్లు వేస్తున్నామని అంటున్నారు. ఇలాంటి వార్తలు సృష్టిస్తే వారికి వచ్చే లాభాలు ఏమిటో నాకు అర్థం కావడం లేదు.
ఒకవేళ వాళ్లు ఇలాగే మాట్లాడాలనుకుంటే.. గడిచిన ఐదేళ్లలో వచ్చిన సినిమాలన్నింటి కలెక్షన్స్ గురించి మాట్లాడాల్సి ఉంటుంది. బ్లాక్ బుకింగ్స్ చేశామని అందుకే ఇన్ని వసూళ్లు వచ్చాయని ఎలా అంటారు? మేము అలాంటి పనులకు పాల్పడలేదు. అవి నిజమైన వసూళ్లు.
ప్రేక్షకుల ప్రేమకు అది నిదర్శనం. మా సినిమా విడుదలై 20 రోజులు అవుతున్నా సోషల్‌మీడియాలో ప్రేక్షకులు వరుస సందేశాలు పెడుతున్నారు. మా చిత్రాన్ని వారెంతగా ఆదరిస్తున్నారో చెప్పడానికి అదే నిదర్శనం. నిజం చెప్పాలంటే, సినిమా విడుదలైన కొన్ని రోజుల పాటే కలెక్షన్స్ గురించి మాట్లాడతారు. ఆ తర్వాత వారికి గుర్తుండేది సినిమా కథ మాత్రమే’’ అని ఆయన అన్నారు.